24న జిల్లా రచయితల సంఘం వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

24న జిల్లా రచయితల సంఘం వార్షికోత్సవం

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

24న జిల్లా రచయితల సంఘం వార్షికోత్సవం రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి రాయితీపై ఆయిల్‌పామ్‌ మొక్కలు చెట్టుకు చిచ్చు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం 6వ వార్షికోత్సవం ఈ నెల 24వ తేదీన స్థానిక వైఎంహెచ్‌ఏ హాలులో నిర్వహించనున్నట్టు ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు లంకా వెంకటేశ్వర్లు, నాగారస్త్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార స్వీకర్త బేతవోలు రామబ్రహ్మం ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్య సభ జరుగుతుందని, అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.

నూజివీడు: మండలంలోని అన్నవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన జే సాయికుమార్‌, ఉదయ్‌ విస్సన్నపేట నుంచి విజయవాడకు బైక్‌పై వెళ్తుండగా అన్నవరం వద్దకు వచ్చేసరికి నూజివీడు నుంచి ఖమ్మం వెళ్తున్న వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్‌ (26) అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన ఉదయ్‌ను చికిత్స నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే రూరల్‌ ఎస్సై జ్యోతీబసు సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): పిల్లలు లేని దంపతులు దేశవ్యాప్తంగా సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ (సీఎఆర్‌ఏ) పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. జిల్లా శిశు గృహ కేంద్రంలోని ప్రత్యేక దత్తత విభాగంలో ఆశ్రయం పొందుతున్న 7 నెలల వయస్సు గల ఆడ శిశువును ఈ ఏడాది మార్చి 17న కర్ణాటక రాష్ట్రానికి చెందిన దంపతులు చట్టబద్ధంగా దత్తత స్వీకరించారు. వారికి నిబంధనల ప్రకారం సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌ నందు తుది ఉత్తర్వులు అందజేశారు. ­

బుట్టాయగూడెం: నూరు శాతం సబ్సిడీపై రైతులకు ఆయిల్‌పామ్‌ మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారిణి ఎన్‌. ప్రసన్నలక్ష్మి తెలిపారు. సోమవారం బుట్టాయగూడెం వ్యవసాయాధికారి కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ గత ఏడాది 594 మంది రైతులకు 680 హెక్టారుల్లో 85 వేల మొక్కలను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా అంతే స్థాయిలో మొక్కలను పంపిణీ చేస్తున్నామని, సబ్సిడీపై ఎరువులు కూడా అందిస్తున్నామని తెలిపారు. మొక్కలు కావాల్సిన రైతులు బ్యాంక్‌ పుస్తకం, ఆధార్‌కార్డు వివరాలతో రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లలను నమోదు చేసుకోవాలన్నారు. అదేవిధంగా జీలుగుమిల్లి మండలంలో కూడా 700 హెక్టారుల్లో 610 మంది రైతులకు సుమారు 87,500 మొక్కలను పంపిణి చేస్తున్నట్లు చెప్పారు.

జంగారెడ్డిగూడెం: దేవులపల్లి – లక్కవరం రహదారిలో ఓ వృక్షం అగ్నికి ఆహుతైంది. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్‌ కాల్చి నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన పడేయడంతో, ఎండు ఆకులు అంటుకుని వృక్షం అగ్నికి ఆహుతైంది. వాహనదారులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక అధికారులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement