ఆస్తి కోసం కన్నవారిపైనే దాడి | - | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం కన్నవారిపైనే దాడి

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

వృద్ధ దంపతులపై దాడికి తెగబడ్డ కుమారుడు, మనవళ్లు

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దృశ్యాలు

నరసాపురం రూరల్‌: సమాజంలో బంధాలు, అనుబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో చెప్పడానికి మొగల్తూరు మండలంలోని కొత్తోట గ్రామంలో జరిగిన ఒక ఘోర సంఘటనే నిదర్శనం. రెక్కలు ముక్కలు చేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని కూడా చూడకుండా, కేవలం ఆస్తి కోసం ఓ కొడుకు, అతని బిడ్డలు (మనవళ్లు, మనవరాలు) కలిసి వృద్ధ దంపతులపై అమానుషంగా దాడికి తెగబడ్డారు. సుమారు రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వివరాల ప్రకారం.. కొత్తోట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సూర్యనారాయణ, కొపనాతి కస్తూరి బాయిలకు ముత్యాలరాజు అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా ఆస్తి విషయమై తల్లిదండ్రులతో ముత్యాలరాజు గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే, ముత్యాలరాజు తన కొడుకులు రాధాకృష్ణ, శేఖర్‌, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధ దంపతులపై కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశాడు. వయసుపైబడిన వారనే కనీస మానవత్వం లేకుండా, ప్రాణాలు తీయాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. వృద్ధులను కిందపడేసి కర్రలతో కొట్టి కాళ్లతో తన్నుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం తీవ్ర గాయాలపాలైన సూర్యనారాయణ, కస్తూరి బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కొన్ని మీడియా ఛానెళ్లలో శ్రీపోలీసులు పట్టించుకోవడం లేద్ఙు అంటూ వస్తున్న వార్తలను మొగల్తూరు పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మొగల్తూరు ఎస్సై జి.వాసు సోమవారం ఒక అధికారిక ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు.ఆ వార్తలు కేవలం అవాస్తవాలని, ఈ గొడవకు సంబంధించి బాధితురాలు కొప్పనాతి కస్తూరి బాయి ఈ నెల 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement