భీమవరం: స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అంటూ అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే భీమవరం పట్టణంలోని వివిధ పంట కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాలతో నిండిపోతున్నాయి. కళ్లెదుటే పంట కాలువను డంపింగ్ యార్డులుగా మారుస్తున్నా మునిసిపల్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధమంటూ సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అనేక పర్యాయాలు సమావేశాలు నిర్వహించినా, జాయింట్ కలెక్టర్ టి రాహుల్‌కుమార్‌రెడ్డి స్వయంగా షాపుల్లో తనిఖీలు చేసినా క్యారీబాగ్‌ల అమ్మకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ప్రధానంగా కిరాణా, స్వీట్స్ షాపులు, కూరగాయల దుకాణాలు, భోజన హోటళ్లు, తోపుడుబండ్లు వంటి వాటి వద్ద వీటి వినియోగం ఎక్కువగా కనబడుతోంది. కొందరు వ్యాపారులు నిజాయతీగా క్యారీబాగ్‌ల వినియోగం తగ్గించినా ఎక్కువ శాతం వ్యాపారులు పట్టించుకోవడం లేదు. అడపాదడపా మునిసిపల్ అధికారులు తనిఖీలు చేసి మొక్కుబడిగా పెనాల్టీలు వేయడం తప్ప కఠినమైన చర్యలు లేకపోవడంతో పట్టణంలో ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి.
ప్లాస్టిక్ వ్యర్ధాలతో పూడిపోతున్న కాలువలు
పట్టణం గుండా లోసరి, గూట్లపాడు వెళ్లే కాలువతోపాటు, చినఅమిరం వెళ్లే పంట కాలువ, లోసరి ఛానల్, అనాకోడేరు పంట కాలువల గుండా భీమవరం మండలంలోని అనేక గ్రామాలకు తాగు, సాగునీటి సరఫరా జరుగుతుంది. ఎంతో ప్రధానమైన కాలువలు భీమవరం పట్టణం మధ్య నుంచి వెళ్లడం ఈ కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతోపాటు చెత్తా, చెదారాలు వేయడంతో నీరు కలుషితమై ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏ కాలువ చూసినా తీవ్ర దుర్గంధం, చెత్తతో నిండి ఉన్నప్పటికీ వీటిని ప్రక్షాళన చేసే చర్యలు లేకపోవడం విశేషం. కాలువల్లో పూడిక తీయించి ప్రక్షాళన చేయాలని, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


