నా బిడ్డ మరణించింది ఆకివీడు పోలీసుల వల్లే | - | Sakshi
Sakshi News home page

నా బిడ్డ మరణించింది ఆకివీడు పోలీసుల వల్లే

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

ఏలూరు (టూటౌన్‌): ఆకివీడు పోలీసుల చర్యల వల్లే తన కుమారుడు వీధి నవీన్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ మృతుని తల్లి వీధి బుజ్జి సోమవారం డీఐజీ అశోక్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఫిర్యాదు వివరాలను ఏలూరు కలెక్టరేట్‌ వద్ద మీడియాకు విడుదల చేశారు. బాధితురాలి కథనం మేరకు ఈనెల 10వ తేదీన ఆకివీడు పోలీస్‌ స్టేషన్‌లో సీఐ ఖాళీచరణ్‌ తమ కుమారుడు వీధి నవీన్‌ కుమార్‌ బట్టలు విప్పి కొట్టాడని, దీంతో నొప్పులు భరించలేక 11వ తేదీన అతడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, తమకు న్యాయం చేయాలని నవీన్‌ తల్లి బుజ్జి కోరారు. తాను గల్ఫ్‌లో ఉపాధి నిమిత్తం పనికి వెళ్లానని చెప్పారు. తమ కుమారుడిపై కోడలు, అత్త పెట్టిన అక్రమ కేసు నిమిత్తం స్టేషన్‌కు పిలిచి బట్టలు ఊడదీసి కొట్టడం కారణంగా తన బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. ఈ విషయంపై భీమవరం డీఎస్పీ, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు ఆటంకాలు కలిగించి అడ్డగించారని చెప్పారు. విధి లేని పరిస్థితుల్లో డీఐజీని కలవడానికి ఏలూరు వచ్చినట్లు తెలిపారు. ఆర్పీఐ పార్టీ మత్తే బాబీ, కుటుంబ సభ్యులతో కలిసి ఆమె డీఐజీని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం డీఐజీ అశోక్‌ కుమార్‌ వెంటనే పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి విచారణకు ఆదేశించారు.

డీఐజీకి ఫిర్యాదు చేసిన మృతుడి తల్లి

Advertisement
 
Advertisement
Advertisement