నూజివీడు: నూజివీడు ప్రాంతంలో అనేక సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు ప్రతి ఏటా రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర నాయకులు చలసాని వెంకట రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరగుంట గ్రామ ఆర్గనైజర్ ద్వారా అడ్వంటా సీడ్ కంపెనీ వారి నాసిరకం మొక్కజొన్న విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన గొల్లపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ప్రారంభించిన చలసాని రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం, రైతులు, వ్యవసాయ అధికారుల మెతకతనాన్ని ఆసరా చేసుకున్న సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు రైతుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నారన్నారు. అనేక గ్రామాల్లో సీడ్ మొక్కజొన్న బాధిత రైతులను బెదిరించటం, ప్రలోభ పెట్టడం వంటి దుష్ట చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. రైతు సంఘం నేత నిమ్మగడ్డ నరసింహా మాట్లాడుతూ గొల్లపల్లి సీడ్ మొక్కజొన్న బాధిత రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా సీడ్ ఆర్గనైజర్ల పట్ల ప్రభుత్వం మెతకతనం విడనాడాలని కోరారు. దీక్షా కార్యక్రమం అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాధిత రైతులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు మడుపల్లి నాగేందర్రావు, చాట్ల పుల్లారావు, సూర్య కుమార్, బాధిత రైతులు బండి రత్నబాబు, మెరుగు సువర్ణరాజు, రుద్రపాటి సురేష్ పాల్గొన్నారు.


