వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షుడు రాజశేఖర్
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని.. సరైన వైద్యం అందక పేద, మధ్య తరగతి వర్గాలు ప్రాణాలపై ఆశలు వదులుకుంటున్నారనీ.. రైతన్నలు పరిస్థితి దారుణంగా తయారైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ విమర్శించారు. ఏలూరు హోటల్ ఎన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర లేక, పంటను అమ్ముకునే పరిస్థితి లేక రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాలతో మేలు జరిగేదని, ధాన్యం కొనుగోలుకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ఆక్వా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టిందనీ, కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించటం దారుణమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను వెంటనే ఆదుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని, రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాల్లోని యుద్ధాలను బూచిగా చూపిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచటం రైతులను నాశనం చేయటానికే అంటూ మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ హామీలు ఇచ్చారనీ, ఇప్పుడు ధరలు పెంచటం అన్యాయం కాదా అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు తల్లాబత్తుల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వామిశెట్టి పావనికుమారి, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, బ్రహ్మయ్య, బేతపూడి రాజేంద్ర, ప్రేమ్, పాముల గంగాధర్‌రావు, తదితరులు ఉన్నారు.


