పీఏసీఎస్‌లో ఇష్టారాజ్యంగా నియామకాలు | - | Sakshi
Sakshi News home page

పీఏసీఎస్‌లో ఇష్టారాజ్యంగా నియామకాలు

May 16 2026 12:51 AM | Updated on May 16 2026 12:51 AM

నూజివీడు: నూజివీడు పీఏసీఎస్‌లో అధికార పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా నియామకాలు చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తమ అనుచరులను, కావాల్సిన వారిని నియమంచుకుంటూ వారికి జీతాల రూపంలో వేల రూపాయలు చెల్లిస్తున్నారు. సొసైటీల్లో ఏవరినైనా నియమించాలంటే జిల్లా స్థాయి సాధికార కమిటీ ఉత్తర్వుల ప్రకారం నియమించుకోవాల్సి ఉండగా ఈ సొసైటీలో ప్రస్తుతం 8 మంది ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వారికి ప్రతినెలా రైతుల సొమ్మును దోచిపెడుతూ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సొసైటీలో పర్మినెంట్‌ పోస్టులు ఆరు ఉండగా ముగ్గురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులలో ముగ్గురు వ్యక్తులను నియమించుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఎనిమిది మందిని నియమించుకున్నారు. ఇందులో ఐదుగురు గత నాలుగేళ్ల నుంచి పనిచేస్తుండగా ముగ్గురిని మాత్రం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇటీవలే నియమించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12 కోట్ల వ్యాపారం మాత్రమే చేసినా సొసైటీ రుణాల రికవరీ కూడా వందశాతం లేదు. ఇష్టారాజ్యంగా నియమించుకొని జీతాలకు సొసైటీ సొమ్మును దుర్వినియోగం చేస్తే తరువాత ఆడిట్‌ అభ్యంతరాలు వచ్చి రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఎవరు భరిస్తారనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికై నా నూజివీడు సొసైటీ తీరుపై సహకారశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement