నూతన వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు
నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీల పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో నాణ్యమైన సాంకేతిక విద్యను అందించేందుకు మరింత కృషి చేస్తానని వైస్ ఛాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు పేర్కొన్నారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నూజివీడు ట్రిపుల్‌ఐటీకి విచ్చేసిన ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడారు. పదో తరగతి పూర్తయిన వెంటనే విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లోని ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో జాయిన్ అవుతున్నారని, వారిని దేశానికి ఉపయోగపడే భావిభారత ఇంజినీర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తన 26 ఏళ్ల అధ్యాపక బోధన అనుభవంతో ట్రిపుల్ ఐటీల్లో సంస్కరణలను తీసుకువచ్చి మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్తానన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయోగపడే నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా బోధన సాగేలా చర్యలు చేపడతామన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో ఆర్జీయూకేటీ పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడించేలా పనిచేస్తామన్నారు. వైస్‌ఛాన్సలర్‌ను ట్రిపుల్ ఐటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెంటార్లు, బోధనేతర సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


