ద్వారకాతిరుమల: అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్టుగా ఉంది ద్వారకాతిరుమల మండలంలోని కొందరు టీడీపీ నాయకుల తీరు. అందినకాడికి దోచుకోవడం.. దాచుకోవడమే వారి అజెండాగా మారింది. రాత్రయితే చాలు వారి చీకటి వ్యాపారానికి తెరతీస్తున్నారు. చెరువుల్లోకి చేరి అక్రమంగా మట్టిని కొల్లగొడుతున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని పలు ప్రాంతాలకు తరలించి, జేబులు నింపుకుంటున్నారు. సూర్యచంద్రరావుపేట కృష్ణాపురం (కనకాపురం) చెరువులో ఈ మట్టి దందా నిత్యం నిరాటంకంగా సాగిపోతోంది. మండలంలోని తిరుమలంపాలేనికి చెందిన ఓ టీడీపీ నాయకుడి టిప్పర్లు, జేసీబీ సహాయంతో, పంగిడిగూడేనికి చెందిన అదే పార్టీ నాయకుడు ఈ మట్టి దందాను సాగిస్తున్నాడు. చీకటి పడగానే టిప్పర్లు, జేసీబీలు చెరువులోకి చేరిపోతున్నాయి. ప్రస్తుతం ఈ చెరువు మట్టిని వెంకటకృష్ణాపురం, తాడేపల్లిగూడెంలోని ఇటుకల బట్టీలకు విక్రయిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ. 6 వేల నుంచి రూ. 10 వేలకు అమ్ముకుని, సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క రాత్రిలో 30 నుంచి 40 టిప్పర్ల మట్టి బయటకు తరలిపోతోంది.
అమలు కాని కలెక్టర్ ఆదేశాలు
కాలువలు.. చెరువు గట్లను కొల్లగొట్టి మట్టి అక్రమ తవ్వకాలు జరిపి, రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలని, అలాగే వాహనాలను సీజ్ చేయాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఈ ఏడాది మార్చి 28న అధికారులను ఆదేశించారు. మట్టి అక్రమ రవాణా నియంత్రణకు ఇరిగేషన్, రెవిన్యూ, పోలీస్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గట్టి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే ఆదేశాలను అటు అధికారులు, ఇటు అక్రమార్కులు మట్టిలో కప్పెట్టేశారు.ఈ అక్రమ దందాపై స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా.. అధికారులు తమకేమీ తెలియనట్టు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
సూర్యచంద్రరావుపేటలో కృష్ణాపురం చెరువుకు తూట్లు


