టి.నరసాపురం: అంతర్జాతీయస్థాయి చదరంగం పోటీల్లో చిన్న గుర్వాయిగూడెం మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థి గుడికందుల చిరన్వి బాలికల అండర్–7 విభాగంలో ద్వితీయ స్థానం సాధించినట్లు విద్యాశాఖాధికారులు టి.రామ్మూర్తి, ఎస్.కళ్యాణిలు తెలిపారు. ఈ మేరకు స్థానిక పాఠశాలలో గురువారం అభినందన సభ నిర్వహించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్, ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల 26న విజయవాడ నగరంలో కానూరులోని స్కాట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ పిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్–2026లో చిరన్వి ప్రతిభ చూపిందన్నారు. హెచ్‌ఎం టి.కన్నయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: హనుమద్ జయంతి మహోత్సవాలల సందర్భముగా గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు. ఉపాలయంలో వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణాన్ని సామూహికంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాష్ట్రంలో పలు ఆలయాలకు చెందిన వేద పండితులతో చతుర్వేదస్వస్తి పారాయణలు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఆర్‌వీ చందన తెలిపారు. శుక్రవారం ఆలయంలో హనుమద్ వ్రతం, మహాశాంతి హోమం నిర్వహిస్తామన్నారు.
ఉండి: మండలంలోని చెరుకువాడ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెరుకువాడ పెదపేటకు చెందిన కంకిపాటి జాన్‌బాబు (27) ఈ నెల 4వ తేదీ రాత్రి 9:30 గంటలకు తన ద్విచక్రవాహనంపై జాతీయ రహదారిలో ఉండి శివారు గోరింతోట వెళ్తున్నాడు. ఈ సమయంలో వెనుక నుంచి లారీ అతనిని ఢీ కొట్టడంతో అతని తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే అతనిని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై అతని తండ్రి లాజరు ఫిర్యాదు మేరకు పోలీసులు 5న కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాన్‌బాబు పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందాడు.


