ఆగిరిపల్లి: మండలంలో కల్లుటూరు, కనసానపల్లిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కలెక్టర్, మైనింగ్ శాఖ అధికారులకు నూజివీడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ రైతు సంఘం అధ్యక్షులు ఈలప్రోలు సుబ్బయ్య, రైతులు ఫిర్యాదు చేశారు. చొప్పరమెట్ల, కల్లుటూరు గ్రామల పరిధిలో ఉన్న గుడ్డేటి రమేష్‌కు 1.96 ఎకరాల్లో మామిడి తోట ఉందని, టీడీపీ మండల అధ్యక్షుడు నక్కనబోయిన వేణు, దాసరి వినోద్ మామిడి తోటను నరికి గ్రావెల్‌ను తవ్వి తరలించారని ఫిర్యాదు చేశారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. అలాగే కనసానపల్లిలో వీఐ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ 1.76 ఎకరాల్లో గ్రావెల్ తవ్వకానికి అనుమతి తీసుకుని, అనుమతికి మించి గ్రావెల్ తవ్వేశారని గ్రామానికి చెందిన ఆలూరు రామ్మోహన్ జిల్లా మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కనసానపల్లిలో గ్రావెల్ తవ్వకాలను పరిశీలించి రూ.కోటిన్నర జరిమానాతో పాటు సంస్థ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు.


