రాములోరి కల్యాణం చూతము రారండి | - | Sakshi
Sakshi News home page

రాములోరి కల్యాణం చూతము రారండి

Mar 24 2026 8:00 AM | Updated on Mar 24 2026 8:00 AM

27న ఉదయం సీతారాముల కల్యాణం

28న పట్టాభిషేకం

ఆకట్టుకుంటున్న ఆలయ శిల్ప సంపద

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమై, చిన్న భద్రాద్రిగా వెలుగొందుతున్న ఈస్టు యడవల్లిలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో ఈనెల 19 నుంచి వసంత నవరాత్రోత్సవ ప్రయుక్త శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్టు దేవస్థానం ఈఓ వై.భద్రాజీ సోమవారం తెలిపారు. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించినట్టు చెప్పారు. ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఈనెల 27 (శ్రీరామనవమి నాడు)న అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. 28 న శ్రీరామ పట్టాభిషేకను వేడుక కన్నులపండువగా జరుపుతామని, ఈ కార్యక్రమంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయన్నారు.

శిల్ప కళావైభం..

ఎకరం విస్తీర్ణంలో అతి సుందర కళా వైభవంతో సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించిన ఈ ఆలయాన్ని శ్రీవారి దేవస్థానం 2003 జూన్‌ 19న దత్తత తీసుకుని, శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం అర్చనాది కార్యక్రమాలు, ఉత్సవాలు, కల్యాణోత్సవాలను నిర్వహిస్తోంది. 52 అడుగుల రాజగోపురం శిల్పకళా వైభవంతో ఉట్టిపడుతోంది. ఇక్కడ 14 అడుగుల సింహ ద్వారాన్ని నిర్మించడం మరో విశేషం. ఆలయ ముఖ మండపంలో ఉన్న స్థంభాలపై గజరాజులు, నాగమోహిని తదితర శిల్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆలయ ముఖ మండపంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల చిత్రీకరణ సజీవంగా ఉంది. అలాగే మండపం మధ్యలో చిన్నికృష్ణుడి శిల్పం ముద్దు గొలుపుతోంది. గర్భగుడిపై పరివార దేవతలకు సంబంధించిన 50 శిల్పాలు, గోదాదేవి దేవాలయంపై 28 శిల్పాలు, రాజ్యలక్ష్మీ దేవాలయంపై 28 శిల్పాలు అతి సుందరంగా ఉన్నాయి. ఆలయ ఆవరణలో శ్రీరాముడికి శబరి నేరేడు పళ్లు ఇస్తున్నట్టుగా ఉన్న శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ క్షేత్రాన్ని అప్పటి రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి కోటగిరి విద్యాధరరావు దంపతుల కృషితో చినజీయర్‌ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement