నడిరోడ్డుపై పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై పడిగాపులు

Mar 21 2026 5:03 AM | Updated on Mar 21 2026 5:03 AM

● కొత్త బస్సులు తీసుకురావాలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం

కాలం చెల్లిన బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాలకు కనీస బస్సు సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వెంటనే పల్లెలకు బస్సు సర్వీసులు పెంచి, పాత బస్సుల స్థానంలో కొత్తవి తీసుకొచ్చి ప్రయాణికులకు మేలు చేయాలి.

– కంభం విజయరాజు, వైఎస్సార్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్‌

ఈ ఏడాది 5 కొత్త బస్సుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు రూటుకు 3 కొత్త బస్సులు, జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి రూటుకు 2 కొత్త బస్సులు నడిపేందుకు అనుమతి కోరాం. అవి రాగానే ఆయా సర్వీసులు ప్రారంభిస్తాం.

– పి.గంగాధర్‌ రావు, జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్‌

కామవరపుకోట: ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సులు తరచూ రోడ్డుపై ఎక్కడికక్కడ నిలిచిపోతుండడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. తుక్కుకు పంపాల్సిన బస్సులను ఆర్టీసీ అధికారులు మరమ్మతులు చేసి తిప్పుతున్నారు. ఈ డొక్కు బస్సులు ఎప్పుడు, ఎక్కడ ఆగిపోతాయోనని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తోంది. అనుకున్న సమయానికి గమ్యం చేరుతామో లేదోనన్న భయం వెంటాడుతోంది.

కొత్త బస్సులు ఎక్కడ?

వేల కిలోమీటర్లు తిరిగిన పాత బస్సులను నడపడంతో బ్రేకులు ఫెయిల్‌ అవుతున్నాయి. సీట్లు ఊడిపోవడం, ఇంజిన్‌ మొరాయించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినప్పటికీ, రద్దీకి తగ్గట్లు అదనపు బస్సులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఉన్న పాత బస్సుల్లోనే ప్రయాణికులు కిక్కిరిసి, నిలబడి ప్రయాణించాల్సిన వస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో బస్సులు మధ్యలో ఆగిపోతే నరకం అనుభవిస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి రెండేళ్లు కావస్తున్నా కొత్త బస్సులు తీసుకురాలేదని, ఉచిత ప్రయాణం పేరుతో పథకం ఉన్నా తగినన్ని బస్సులు లేక సక్రమంగా అమలు కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జంగారెడ్డిగూడెం డిపోలో మొత్తం 85 బస్సులు ఉండగా, వివిధ ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నారు. వీటిలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు– 5, డీలక్స్‌–14, సూపర్‌ లగ్జరీ–9, ఇంద్ర–2, స్లీపర్‌ ప్లస్‌–2, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు– 38, పల్లె వెలుగు బస్సులు 15 ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పాత బస్సుల స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,500 కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు తీసుకురాగా, వాటిలో 8 బస్సులను జంగారెడ్డిగూడెం డిపోకు కేటాయించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కొత్త బస్సుల ఊసే లేదు. ఉన్న పాత బస్సులతో నెట్టుకురావడం ఆర్టీసీ సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలని పలువురు కోరుతున్నారు.

కాలం చెల్లిన బస్సులతో ప్రయాణం ఎలా?

మొరాయిస్తున్న ఆర్టీసీ బస్సులు

గమ్యం చేరేదాకా ప్రయాణికుల్లో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement