చింతలపూడి: నెల రోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగ శనివారం జరుపుకోనున్నారు. శుక్రవారం నెలవంక దర్శనం ఇవ్వడంతో నెల రోజుల నుంచి చేస్తున్న కఠిన ఉపవాసాలను ముస్లింలు నమాజుతో విరమిస్తారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఫిత్రాలు, జకాత్‌లు ప్రత్యేక ప్రార్ధనలు చేసే ముందే పేదలకు అందచేయడం చేస్తారు. ఈదుల్ ఫితర్ నమాజ్‌ను పురస్కరించుకుని పిల్లలు, పెద్దలు కొత్త దుస్తులు ధరించి ఈద్‌గాహ్ , మసీదులకు వెళ్ళి సామూహికంగా ప్రార్థనలు చేస్తారు. నమాజు అయిన తరువాత ముస్లింల స్మశాన వాటిక(ఖబరస్తాన్)ల కు వెళ్ళి పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు. అనంతరం కుటుంబంలోని పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలియచేసి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం తప్పని సరిగా భావిస్తారు. నమాజు ముగిశాక బంధు మిత్రులను, స్నేహితులను ఆహ్వానించి సేమియ పాయసం, షీర్ ఖుర్మాలు తినిపిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రం పసందైన వంటకాలతో స్నేహితులను, బంధు మిత్రులను పిలిచి ఆప్యాయంగా పెడతారు.
భీమవరం: భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆవరణలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ చాంపియన్‌ప్ పోటీలు ముగిశాయి. సింగిల్స్ 55 ప్లస్ విభాగంలో కె.వి.ఎన్.మూర్తి, 45 ప్లస్ విభాగంలో ఎ.వి.ఎల్.ఎన్ రాజు, 35 ప్లస్ విభాగంలో ఎన్.డి.విజయ్ ఆనంద్ విజేతలుగా నిలిచారు.
డబుల్స్ 70 ప్లస్ విభాగంలో ఎ.రాంబాబు, సేతు, 65 ప్లస్ విభాగంలో వి.శ్రీనివాసరెడ్డి, ఎస్ మన్మథరావు, 55 ప్లస్ విభాగంలో కె.వి.ఎన్ మూర్తి, డి.హేమంత్ కుమార్, 45 ప్లస్ విభాగంలో రాజేంద్ర ప్రసాద్, కె.సంపత్‌కుమార్, 35 ప్లస్ విభాగంలో పి.సి. విఘ్నేష్, పి.పవన్‌కుమార్ విజేతలుగా నిలిచారు.


