నీరు, ఆహారం అధికంగా అందించాలి
బుట్టాయగూడెం: రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే ఇక పక్షులు, పశువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువులు రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటాయి. సహజంగా 18–35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు పశువులకు సౌకర్యంగానే ఉంటాయి. ఆపై ఉష్ణోగ్రతలు నమోదైతే పశువులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పశువైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ కారణంగా పశువులు మృతిచెందే అవకాశం కూడా ఉంది. వేసవిలో పాడి రైతులు ప్రత్యేక మెలకువలు పాటించాల్సి ఉంటుంది. పశువులకు వేసవిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. అదేవిధంగా పశువులకు వేసవికాలంలో కావాల్సినంత మేత కూడా దొరకదు. దీనివల్ల పశువులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటాయి. ఈ క్రమంలో పాడిరైతులు పశువుల సంరక్షణపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యులు సూచిస్తున్నారు.
వడదెబ్బ తగలకుండా..
పశువులను మేత కోసం అడవుల్లోకి, పొలాల్లోకి తీసుకువెళ్తారు. వేసవిలో ఇలా చెయ్యడం వల్ల పశువులు అధిక వేడిని తట్టుకోలేక వడదెబ్బకు గురవుతాయి. పశువులు ఎక్కువ సమయం ఎండలోనే ఉండడం, తాగునీరు పూర్తి స్థాయిలో లభించకపోవడం వల్ల కూడా వడదెబ్బకు గురవుతాయి. పశువు శరీర ఉష్ణోగ్రత, శ్వాస, నాడి వేగం బాగా పెరుగుతుంది. చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అపస్మారక స్థితికి చేరుకుని పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. పశువుల్లో ఈ లక్షణాలు కనిపెట్టిన వెంటనే వడదెబ్బ తగిలిందని గుర్తించి వాటిని వెంటనే చల్లని ప్రదేశానికి లేదా షెడ్‌లోకి తీసుకుని వెళ్ళాలి. అలాగే పశువును చల్లని శుభ్రమైన నీటితో కడగాలి. పశువులు తాగినంత నీరు పట్టించాలి. ప్రాథమిక చికిత్స అందించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలోనే పశువులను మేతకు తీసుకువెళ్ళడం మంచిదని పశువైద్యులు సూచిస్తున్నారు.
పాడి రైతులకు జాగ్రత్తలు సూచిస్తున్న పశు వైద్యులు
వేసవిలో పశువులు మేతను తక్కువగా తీసుకుని నీటిని ఎక్కువగా తాగుతాయి. పశువులు తాగే నీరు పుష్కలంగా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నీరు అన్నివేళలా పశువులకు అందుబాటులో ఉండాలి. ఆహారం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పగటిపూట పచ్చగడ్డి, దాణా మిశ్రమాన్ని ఇచ్చి రాత్రి ఎండుగట్టి పెట్టాలి. పగటిపూడ ఎండుగడ్డి పెడితే పశువులు నీరు ఎక్కువగా తీసుకుని మేత తక్కువగా తింటాయి.
డా.ఎం.బుచ్చారావు, పశుసంవర్ధక శాఖ ఏడీ


