అమ్మవారి విగ్రహ ధ్వంసంపై ఫిర్యాదు
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం సమీపంలోని శ్రీ నీలాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై రైతులు పీఎస్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో హిందువుల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. హుండీ కూడా బద్దలు కొట్టి విలువైన సొత్తును అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కై కలూరు: మండలంలోని కొల్లేటికోట పెద్దింట్లమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి రూ.21,530 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు.
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఆలయంలో ఉదయం హనుమద్ హోమం, సువర్చలా హనుమద్ కల్యాణం ఆలయ అర్చకులు, వేద పండితులు, రుత్వికుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ సేవల రూపేణా రూ.2,47,129 సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 3,600 మంది భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం శ్రీ రాజా రాజేశ్వరి కూచిపూడి నాట్యలయం విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు.
జంగారెడ్డిగూడెం : మైసన్నగూడెం, శ్రీనివాసపురం గ్రామాల పరిధిలో రాళ్ల కాలువను బాగు చేసి మురుగునీరు వెళ్లేలా ముంపు నివారణకు చర్యలు చేపట్టాలని రైతు సంఘం ఆధ్వర్యంలో మైసన్నగూడెంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతులు బొడ్డు దుర్గారావు, పాతూరి జానకిరామయ్య మాట్లాడుతూ.. రాళ్ల కాలువ బాగు చేయకపోవడంతో మైసన్న గూడెం, శ్రీనివాసపురం గ్రామాల పరిధిలో వందలాది ఎకరాల పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వర్టు నిర్మాణం లేకపోవడంతో పొలాలకు వెళ్లే మార్గం మూసుకుపోయి రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని చెప్పారు. మైసన్నగూడెం నుంచి పొలాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం సరిగా లేదన్నారు. రాళ్ల కాలువ బాగు చేయడానికి, కల్వర్టు, రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. రైతు సంఘం నాయకులు బొడ్డు రాంబాబు, సిరిబత్తుల సీతారామయ్య, రైతులు పాల్గొన్నారు.
అమ్మవారి విగ్రహ ధ్వంసంపై ఫిర్యాదు
అమ్మవారి విగ్రహ ధ్వంసంపై ఫిర్యాదు


