కొల్లేరులో పడవ ప్రయాణాలు వద్దు
కై కలూరు/మండవల్లి: మోంథా తుపాను నేపథ్యంలో కొల్లేరు ప్రజలు పడవ ప్రయాణాలు చేయవద్దని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహరాల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి నాదెండ్ల మనోహర్ సూచించారు. మండవల్లి మండలం పెదఎడ్లగాడి వద్ద నీటి ప్రవాహాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. పెదఎడ్లగాడిలో గుర్రపుడెక్కను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, రాష్ట్ర వడ్డీ కార్పోరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ, అధికారులు పాల్గొన్నారు. కొల్లేరు నీటిని సముద్రానికి పంపించే ఉప్పుటేరు ప్రవాహాన్ని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ యాదవ్, డెప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రాఘరామకృష్ణంరాజు పరిశీలించారు.
జంగారెడ్డిగూడెం: మోంథా తుపాను బాధితుల కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ పట్టణాధ్యక్షుడు కర్పూరం గుప్త మాట్లాడుతూ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయ రాజు, బత్తిన నాగలక్ష్మి నేతృత్వంలో జంగారెడ్డిగూడెం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున బత్తిన చిన్న కళ్యాణ మండపం వద్ద తుపాను బాధితులకు షెల్టర్, భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బత్తిన చిన్న, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


