
కుమ్మరిగట్టులో 9 డయేరియా కేసులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం సమీపంలో ఉన్న కుమ్మరిగట్టు గ్రామంలో సుమారు 9 మంది వాంతులు, విరోచనాలతో బాధపడుతుండగా మరొక ఐదుగురు జ్వరాల బారిన పడ్డారు. దీంతో నందాపురం పీహెచ్‌సీకి సంబంధించిన వైద్యులు డాక్టర్ సల్మాన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు వైద్యసేవలు అందించారు. రోగుల్లో యండమూరి వెంకటలక్ష్మితో పాటు మీనాక్షి అనే చిన్నారిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం తరలించారు. ఈ వైద్యశిబిరాన్ని డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ అమృతం సందర్శించి గ్రామంలో డయేరియా కేసుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ వైద్య శిబిరాన్ని మరో ఐదు రోజులపాటు కొనసాగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఓ హరేంద్రకృష్ణ, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ జె. సురేష్, సర్పంచ్ ఎం.రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి కలుషిత నీరు కారణమా? లేక మరేదైనా ఉందా? అని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.
పాలకొల్లు సెంట్రల్: తండ్రికి కుమార్తె తలకొరివిపెట్టిన ఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. పట్టణంలోని బ్రాడీపేట మూడవ వీధికి చెందిన సారిక సత్యనారాయణ (80) గత రెండేళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితం కాగా సోమవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఉండి నియోజకవర్గం కాళ్ల గ్రామంలో ఉంటున్న కుమార్తె తండ్రి సత్యనారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించింది. పెన్షన్‌తోనే జీవనం సాగించే సత్యనారాయణకు సచివాలయ సిబ్బంది ఉదయం సుమారు 8 గంటల సమయంలో పింఛన్ ఇవ్వడానికి వెళ్లగా అప్పటికే మృతి చెందాడు.