
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
కుక్కునూరు: స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిని 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 6వ తరగతికి చెందిన 8 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తిన్న తరువాత వాంతులు అవ్వడంతో వెంటనే ఉపాధ్యాయులు స్థానిక పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. దీనిపై పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ సుప్రియను వివరణ కోరగా విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని, చికిత్స అందించిన వెంటనే పంపించివేశామని చెప్పారు. కాగా దీనిపై విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులను నిలదీశారు. భోజనం తిన్న వెంటనే వాంతులు అయ్యాయని విద్యార్థులు చెబుతుంటే, బయట నుంచి తెచ్చుకున్న బిస్కెట్‌లు తినడం వలనే విద్యార్థులకు వాంతులు అయ్యాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఎంపీపీ చేబ్రోలు గీతావాణి, సర్పంచ్ రావు మీనాతో కలిసి పాఠశాలకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భోజనంలో నాణ్యత పాటించాలని సూచించారు.