
అయినవాళ్లే ఆదరించకపోతే..!
తణుకు అర్బన్: నడవలేని స్థితిలో ఉండడంతో భారమవుతాడనుకున్నారో ఏమో కానీ తండ్రి, తోడబుట్టిన సోదరులు ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో తనను ఇంట్లోకి రానివ్వండి అంటూ ఆ యువకుడు వేడుకుంటూ రోదిస్తున్న తీరు ఆ ప్రాంతవాసులను కలచివేస్తోంది. మానవత్వాన్ని మంటకలిపే ఈ ఘటన తణుకు మండలం వేల్పూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలోని సాలిపేటకు చెందిన తాడిశెట్టి నాగ త్రినాఽథ్ గత ఏడేళ్లుగా సింగపూర్‌లోని షిప్‌యార్డులో రెస్క్యూ టీంలో ఉద్యోగిగా ఉపాధి పొంది కుటుంబంలో ఏర్పడ్డ సమస్యలతో గతేడాది జూలైలో ఇండియాకు వచ్చారు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో నడుము భాగంలో తగిలిన గాయానికి కాలు కదపలేని స్థితిలో విశాఖపట్నం, విజయవాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. చేతిలో ఉన్న డబ్బు అయిపోగా సోమవారం ఆస్పత్రి నుంచి ఇంటికి రాగా ఇంట్లోకి రానీయకుండా తండ్రి, అన్నదమ్ములు ఇంటి తలుపులు మూసేశారు. దీంతో దిక్కుతోచక ఇంటి ముందు రోదిస్తూ ఉండిపోయారు. గతంలోనే తల్లి చనిపోగా తండ్రి తాడిశెట్టి నాగేశ్వరరావు, అన్న, తమ్ముడు ఇంట్లోకి రానీయడంలేదని చెబుతున్నారు. సింగపూర్‌లో ఉన్నంత కాలం సంపాదించిన సొమ్ము అంతా ఇంటికే పంపించానని, కానీ నేడు ఆరోగ్యం బాగోలేని సమయంలో సొంతవాళ్లే పట్టించుకోవడంలేదని త్రినాథ్ వాపోతున్నారు. నడవలేని స్థితిలో యూరిన్ బ్యాగ్‌తో వీల్‌చైర్‌లో ఉన్న త్రినాథ్ పడుతున్న ఆందోళన, ఆవేదన వర్ణనాతీతంగా మారింది. తన సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లతోపాటు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణలను సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు.