ఏడాదంతా పందేల జాతరే | - | Sakshi
Sakshi News home page

ఏడాదంతా పందేల జాతరే

Jul 23 2025 7:11 AM | Updated on Jul 23 2025 7:11 AM

ఏడాదంతా పందేల జాతరే

ఏడాదంతా పందేల జాతరే

సాక్షి, టాస్క్‌ ఫోర్సు: ఆ ఆసామి తాలూకా వ్యవసాయ క్షేత్రం ప్రయోగాలకు కేంద్రంగానే కాకుండా, జూద క్రీడా ప్రాంగణంగా మారడం చర్చనీయాంశంగా మారింది. ఈ తోటకు తాడేపల్లిగూడెం వ్యాపార కేంద్రంలో మంచి పేరుంది. ఒకప్పుడు పేకాటకు కేరాఫ్‌గా ఉండే ఈ ప్రాంతం నూతన ప్రభుత్వ హయాంలో కోడి పందేల అడ్డాగా మారింది. రాత్రయితే జాతరే జాతర. తొమ్మిదైతే చాలు తోటకు నలువైపులా ఉన్న దారులు తెరుచుకుంటాయి. క్వారీ ల్యాండ్‌, లారీ స్టాండ్‌లు దాటి వచ్చిన వాహనాలు ఈ తోట వైపునకే దారి తీస్తాయి. ప్రైవేటు సైన్యం పహరాలో , నిఘాలో ఉన్న ఈ క్షేత్రానికి ఉన్న రెండు ద్వారాలు ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ ముగిసిన తర్వాత వాహనాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారు. ఇక ఆ తర్వాత ఫ్లడ్‌లైట్ల కాంతిలో కొక్కొరొకో శబ్దాలు, కాయ్‌రాజా కాయ్‌ అంటూ పందెగాళ్లు నోట్ల కట్టలతో జూద క్రీడా విన్యాసంతో వీర విహారం చేస్తారు. రాత్రంతా కోడి పందేలు నిర్వహిస్తున్నా, పోలీసులు తమకేం తెలియదన్నట్టు అటువైపు వెళ్లడానికి సాహసించరు. అధికారానికి సలాం అంటూ మాకెందుకులే అనుకుంటారు. దీంతో ఈ జూద క్రీడకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎంత నిఘా ఉన్నా ఉన్నతాధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసు డివిజన్‌ కార్యాలయం జూద క్రీడా ప్రాంగణంగా చెబుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉన్నా, అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో తెలియదంటున్నారు. కొన్ని రోజులు జూదాలకు అడ్డుకట్ట పడినట్టుగా కనిపించినా ప్రస్తుతం వారం రోజులుగా కోడి పందేలు ఆ తోటలో యథేచ్ఛగా సాగుతున్నాయని అంటున్నారు. టార్పాలిన్‌ పందిరి, చుట్టూ ఫెన్సింగ్‌, కుర్చీలు, తినేందుకు అన్ని వసతులు ఆ తోటలో సమకూర్చడంతో రాష్ట్రంలోని పందెంగాళ్లు ఇక్కడకు డబ్బుల కట్లతో వాలిపోతున్నారు.

అధికారం అండతోనే.. జూద నిర్వాహకులు కూటమికి చెందిన పార్టీ నేతగా చెబుతున్నారు. పందేల నిర్వాహణలో పీహెచ్‌డీ చేసిన ఆ వ్యక్తి నేతృత్వంలో జూద దందా మూడు పందేలు.. ఆరు నోట్ల కట్టలుగా సాగుతుందని చెబుతున్నారు. అధికార నేతల అండదండలతో అసాంఘిక కార్యక్రమాలు సాగుతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా పందేలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

పోలీసులు అసలు పట్టించుకోరు

నిఘా కూడా అంతే...

అధికార పార్టీ ఆశీస్సులు, అండాదండాతోనే యథేచ్ఛగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement