
పోరుబాటకు అంగన్‌వాడీలు సిద్ధం
అంగన్‌వాడీల ప్రధాన డిమాండ్లు
● టేక్ హోం రేషన్, ఇతర సేవల కొరకు ఎఫ్‌ఆర్‌ఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసే నిబంధన అమలును వెంటనే ఆపాలి.
● అంగన్‌వాడీ రిపోర్టింగ్ విధానం డిజిటలైజేషన్ అమలుకు ముందే ఆయా కేంద్రాలన్నింటికీ కంప్యూటర్/లాప్‌టాప్/టాబ్‌లు అందించాలి.
● అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్రీ వైఫై కనెక్షన్ అందించాలి. లేదా డేటాకు సరిపడా నగదు చెల్లించాలి.
● సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆధార్ ధ్రువీకరణ, ముఖ గుర్తింపు వంటివేమీ లేకుండానే లబ్ధిదారులందరికీ నాణ్యమైన అనుబంధ పోషకాహారాన్ని అందించాలి.
● పోషణ్ ట్రాకర్ యాప్‌కు సంబంధించిన సమస్యలు చర్చించటానికి అంగన్‌వాడీ ఫెడరేషన్స్ అన్నింటితో కలిపి మూడు పక్షాలతో కూడిన సమావేశం వెంటనే నిర్వహించాలి.
● నెలకు రూ.26 వేల కనీస వేతనం, పెన్షన్, సామాజిక భద్రతా సదుపాయాలు ,గ్రాట్యుటీ వంటివి అమలు చేయాలి.
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు పోరు బాటకు సిద్దమవుతున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే ఏలూరు కలెక్టరేట్, ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం మాత్రం సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో అంగన్‌వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా కోరుతున్న సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టేందుకు వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఎన్నికల ముందు చెప్పిన వాటి ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకు వందనం అంగన్‌వాడీలకు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న అంగన్‌వాడీకు అమ్మకు వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మినీ వర్కర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ సెంటర్లు నిర్వహిస్తున్నారని వారిని వెంటనే మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ముఖ గుర్తింపు విధానం రద్దు చేయాలి
ముఖ గుర్తింపు విధానాన్ని తక్షణం రద్దు చేయాలని కోరుతున్నారు. 2022 లో ఇచ్చిన మొబైల్ ఫోన్‌లో యాప్‌లు పని చేయడం లేదని, యాప్‌లో అప్‌లోడ్ చేయకపోతే సరుకులు ఇవ్వమని చెప్పడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలలో నేటికీ సిగ్నల్స్ రాక అనేక ఇబ్బందులు పడుతుంటే అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహారిస్తున్నారని విమర్శిస్తున్నారు. తక్షణమే గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పేస్ యాప్ రద్దు చేయాలని కోరుతున్నారు.
సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్
మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని వినతి
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి