
అత్యాచారం కేసులో పదేళ్ల జైలు
ఏలూరు (టూటౌన్)/ పెనుగొండ: అత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీవీ రామాంజనేయులు వెల్లడించారు. పెనుగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బాధిత యువతి వ్యవసాయ కూలీగా జీవనం సాగించేది. సుమారు ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నిందితుడు అంజూరి ప్రసన్న కుమార్ ప్రేమ పేరుతో ఆమెకు సన్నిహితమయ్యాడు. వివాహం చేసుకుంటానని మోసం చేసి, ఆమెను బలవంతంగా శారీరక సంబంధానికి గురిచేశాడు. అనంతరం నిందితుడు విదేశానికి (గల్ఫ్) పరారయ్యాడు. తన తల్లిదండ్రుల సహకారంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీనిపై బాధిత యువతి పెనుగొండ పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్సై బి.మోహన్‌రావు కేసు నమోదు చేశారు. అనంతరం సీఐ జీవీవీ నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి అంజూరి ప్రసన్న కుమార్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటుగా రూ.5 వేలు జరిమానా విధిస్తూ మహిళా కోర్టు ఐదవ అదనపు జిల్లా జడ్జి ఆర్‌వీవీఎస్ మురళీకృష్ణ మంగళవారం తీర్పు వెలువరించారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీవీ రామాంజనేయులు వాదనలు వినిపించగా కోర్టు కానిస్టేబుల్ తిమ్మరాజు నాగబాబు, లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై ఎస్.ప్రదీప్ కుమార్ విచారణకు సహకరించారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం
పెదవేగి: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. బాపిరాజుగూడెం గ్రామానికి చెందిన చొదిమెల్ల యాకోబు (45) గ్రామంలో నూతనంగా ఒక ఇంటిని నిర్మించుకుంటున్నాడు. మంగళవారం ఆ ఇంట్లో పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.