
గోదావరి కడలిపాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి మహోగ్రరూపం దాల్చి కడలిపాలవుతోంది. ఒకటి, రెండు టీఎంసీలు కాదు ఏటా సగటున 1,900 టీఎంసీల గో దావరి జలాలు పోలవరం నుంచి ధవళేశ్వరం మీ దుగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ప్రధానంగా రెండు వరదల సీజన్లలోని వెయ్యి టీఎంసీలు వృథాగా పోతున్నాయనేది అధికారిక అంచనా. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగడంతో పాటు 2020 నుంచి ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకున్నారు. నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి వరద తీవ్ర త దాదాపుగా తగ్గుముఖం పట్టింది.
ఈనెల 2 నుంచి..
ఈ నెలలో గోదావరి వరద తీవ్రతతో 420.26 టీ ఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. ఈనెల 2వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్టుకు వరద తాకిడి ప్రారంభమైంది. 10వ తేదీ వరకు సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు, 11 నుంచి 13 వరకు రోజుకు సగటున 7.50 లక్షల క్యూసెక్కుల నీరు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి గోదావరిలో చేరింది. దీంతో గోదావరితో పాటు ఉపనది అయిన శబరి పొంగి పొర్లుతుండటంతో ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు ముంపు మండలాలు, పశ్చిమగోదావరిలోని యలమంచిలి, లంక గ్రామాల్లో స్వల్ప ఇబ్బందులు తలెత్తాయి. ఈ వరదల సీజన్ లో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరడంతో వేలేరుపాడు మండలంలోని ఎద్దులవాగు వంతెన, కుక్కునూరులోని గుండేటివాగులోని లోలెవల్ వంతెనలు నీటమునిగాయి. దీంతో వేలేరుపాడులో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండు మండలాల్లో సుమారు 270 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. సోమవారం గోదా వరి ఉధృతి గణనీయంగా తగ్గింది. భద్రాచలం వద్ద 22.60 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు నుంచి 3,78,800 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఇంకోవైపు నీటమునిగిన ఎద్దులవాగు, గుండేటివాగు లోలెవల్ వంతెనలు మంగళవారానికి యథాస్థితికి చేరే అవకాశం ఉంది.
వందల టీఎంసీలు..
2020 నుంచి పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్నారు. అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు వేగవంతంగా నడిచాయి. 2020 నుంచి 25.72 మీటర్ల మేర 30 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం 51 మీటర్లు పూర్తయితే 197 టీఎంసీల నీటిని నిల్వ చేసే పరిస్థితి ఉంటుంది. పునరావాసం పూర్తికాకపోవడం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకే జీ చెల్లింపులు జరపకపోవడంతో వరద నీటిని నిల్వ చేయలేని పరిస్థితి. దీంతో వరద నీరు వస్తే 48 గేట్లు ఎత్తేసి ఎంత నీరు వస్తే అంత దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఏటా వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ప్రత్యేకంగా జూలై, ఆగస్టు నెలల్లోనే 1,500 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. ఈనెల 2వ తేదీ నుంచి సోమవారం వరకు 420.26 టీఎంసీల నీరు సముద్రంలోకి చేరింది. మరో వారం పాటు పోలవరం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంది.
పోలవరం ప్రాజెక్టుకు చేరిన వరద నీరు
ఏటా వందల టీఎంసీల జలాలు సముద్రంలోకి..
ఏటా జూలై, ఆగస్టులో వరదలు
సగటున వెయ్యి టీఎంసీలు వృథా
120 రోజుల వర్షాకాల వ్యవధిలో 1,900 టీఎంసీలు సముద్రం పాలవుతున్నట్టు అంచనా
ఈ నెలలో ఇప్పటివరకు 420.26 టీఎంసీలు కడలిపాలు
ప్రాజెక్టులో 30 టీఎంసీల నీరు నిల్వ