
గతేడాది కోటానే కేటాయించాలి
జంగారెడ్డిగూడెం: ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో గత ఏడాది ఇచ్చిన కోటానే ఈ ఏడాది కేటాయించాలని వర్జీనియా రైతు సంఘం నాయకులు కోరారు. మంగళవారం జంగారెడ్డిగూడెం వర్జీనియా వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు చైర్మన్ పి.యశ్వంత్‌కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వేలం ప్రక్రియను ఆయన పరిశీలించారు. చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వర్జీనియా రైతు సంఘం నాయకులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని చైర్మన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో ఇచ్చిన అధీకృత కోటాలో సగం పొగాకు అమ్మకాలు పూర్తయ్యాయని, వీటిలో క్లస్టర్ షెడ్యూల్ ప్రకారం చాలా మంది రైతుల కోటాలు పూర్తయ్యాయన్నారు. కోట పూర్తయిన రైతులకు అదనపు కోటా కల్పించి అదనంగా పండిన పంటను అమ్మకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. గత సంవత్సరం ఇచ్చిన కోటా 58.25 మి.కిలోలు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో పొగాకు రైతు సంఘం నాయకులు పరిమి రాంబాబు, సత్రం వెంకట్రావు, వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు గడువు పొడిగింపు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీని పొడిగించినట్లు డీఈవో ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, స్థానిక సంస్థల, మున్సిపల్, ఏపీ మోడల్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అర్హులన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి తొలుత ఈ నెల 15వ తేదీ వరకూ గడువు ఇవ్వగా, గడువును ఈ నెల 17 వరకు పొడిగించారని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు అర్హులు కారని, సంబంధిత సంవత్సరంలో కనీసం నాలుగు నెలలు విధులు నిర్వహించిన వారు ఇతర అర్హతలన్నీ పూర్తిగా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
నైట్ వాచ్‌మెన్ల జీతాలు చెల్లించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ పాఠశాలలలో రాత్రిపూట కాపలాదారుగా పనిచేస్తున్న నైట్ వాచ్‌మెన్ జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నైట్ వాచ్‌మెన్ జీతాలు చెల్లించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుచ్చిబాబు మాట్లాడుతూ నైట్ వాచ్‌మెన్‌ల గౌరవ వేతనం నెలల తరబడి చెల్లించడం లేదని విమర్శించారు. దీంతో వారి కుటుంబాల జీవనం చిన్నాభిన్నం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతం తక్కువ పని ఎక్కువ చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. నెల నెల సక్రమంగా జీతాలు చెల్లించాలని, నైట్ వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్న వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం నెలకు రూ.10 వేలు చెల్లించాలని, పని సమయంలో భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అదనపు సంచాలకుడికి అందజేశారు.
ఇంటర్ విద్య పెన్షనర్ల ఆందోళన
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని ఇంటర్ విద్య పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెన్షనర్స్ మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా నుద్దేశించి అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.శ్యాంబాబు, కె.భవన్నారాయణ మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించి ఐఆర్‌ను ప్రకటించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను వెంటనే ప్రకటించాలని కోరారు.