
ఉపాధి వేతనాల కోసం ఎదురుచూపులు
ఏలూరు (టూటౌన్): ఉపాధి కూలీలకు నెలలు తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గత రెండు నెలలుగా వేతనాలు విడుదల కాలేదు. ఒక పక్క పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు లేకపోయినా కూలి డబ్బుల కోసం ఆశపడి పనిచేస్తున్నా వేతనాలు చెల్లించకపోవడం పట్ల కూటమి ప్రభుత్వంపై ఉపాధి హామీ కూలీలు మండి పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతీ 15 రోజులకోసారి ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించేవారని దానికి భిన్నంగా ప్రస్తుత కూటమి పాలకులు రెండు నెలలు దాటినా వేతనాలు చెల్లించకపోవడం పట్ల ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 5.57 లక్షల మంది ఉపాధి కూలీలు
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 27 మండలాల పరిధిలో మొత్తం 3.77 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 5.57 లక్షల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. కూలికి ఏడాదికి వంద రోజులు పనిదినాలు కల్పించాల్సి ఉండగా జిల్లాలో సగటున ఒక్కో కూలీకి 46 రోజుల పనిదినాలనే కల్పించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్ధేశించిన ప్రకారం ప్రతి 15 రోజులకొకసారి కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా అది ఎక్కడా అమలు కావడం లేదు. కూలీలకు పే స్లిప్స్ ఇవ్వడం లేదు.
రూ.50 కోట్ల బకాయిలు
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉపాది హామీ పథకంలో కూలీలకు గత మే 15 నుంచి ఇంతవరకు దాదాపు రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ఏలూరు జిల్లాలో కూలీలకు రూ.50 కోట్ల వేతన బకాయిలు పేరుకుపోయాయి. మే, జూన్ నెలలకు సంబంధించి వేతన బకాయిలు మొత్తం రూ.50 కోట్లు ఉన్నాయి. వీటికి అదనంగా ప్రస్తుత జూలై నెలకు సంబంధించిన బకాయి వేతనాలు మరో రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.
పని ప్రదేశాలలో కనీస సౌకర్యాల కరవు
ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల్లో భాగంగా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఇటు ఉపాధి కూలీలు, అటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పని ప్రదేశాలలో నీడ కోసం టెంట్, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, పనిముట్లు, మేట్లకు రూ.5 అదనపు పారితోషికం ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పట్ల నిరంకుశంగా వ్యవహారిస్తున్నాయని వాటిని ఎదుర్కోవటం కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు.
రెండు నెలలుగా అందని వైనం
ఏలూరు జిల్లాలో రూ.50 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు

ఉపాధి వేతనాల కోసం ఎదురుచూపులు