
మంచినీటి చెరువులో చేపలు మృతి
కాళ్ల: మండలంలోని కోలనపల్లి రక్షిత మంచినీటి సరఫరా చెరువులో చేపలు చనిపోవడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గత ఐదు రోజులుగా చెరువులో చేపలు చనిపోయి నీటిపై తేలటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నీరు కలుషితంగా మారి చేపలు చనిపోయాయా.. లేక ఆక్సిజన్‌న్ అందక చనిపోయాయా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇటీవల చెరువుకు నీరు నింపారని, దానివల్లే చేపలు ఇలా చనిపోతున్నాయా? అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన చేపల వల్ల వాసనతో చెరువు చుట్టూ ఉన్న కుటుంబాలతో పాటు రోడ్డుపై వెళ్ళే వారు ముక్కులు మూసుకోవాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. చెరువు గట్టు చుట్టూ మొలిచిన పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తుందని, విషసర్పాలకు ఆవాసంగా చెరువుగట్టు మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓ పక్క గ్రామంలో మంచినీటి కోసం నానా అవస్దలు పడుతుంటే మరో పక్క ఇలా మంచినీటి చెరువులో చేపలు చనిపోవటంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఫణిని వివరణ కోరగా చెరువులో ఉన్న నీటిను వెంటనే పూర్తిస్థాయిలో బయటికి మళ్ళించి, కొత్తనీరు పెట్టాలని పంచాయతీ అధికారులకు సూచించామన్నారు. చెరువు గట్టు చుట్టూ ఉన్న చెత్త, చెదారాలు పూర్తిస్థాయిలో తొలగించాలని కార్యదర్శికి తెలిపామన్నారు.