
నీరందక రైతుల కన్నీరు
దెందులూరు: సాగునీరు అందక వరి నారుమళ్లు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలు బీటలు వారాయని, కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలు కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఎండిపోతున్న వరి నారుమడిలో బీటలు వారిన వరి మట్టిగడ్డలతో నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతులు జిల్లెల్లమూడి ప్రసాదరావు, చిన్ని పోతురాజు, అన్నంరెడ్డి రంగారావు, బైరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ అప్పులు తీసుకువచ్చి నారుమళ్లు, నాట్లు వేసిన వరిచేలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏలూరు రూరల్ మండలం కృష్ణా డెల్టా పరిధిలోని వెంకటాపురం, మాదేపల్లి, జాలిపూడి, చాటపర్రు, పోణంగి, కొమడవోలు, కాట్లంపూడి తదితర గ్రామాలలో వేలాది ఎకరాల కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందడం లేదన్నారు. కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేశామని, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తున్నామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా శివారు ప్రాంత భూములకు ఎందుకు సాగునీరు అందించలేకపోతున్నారని ప్రశ్నించారు. పంటలు ఎండిపోవడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కృష్ణా మెయిన్ కెనాల్ నుంచి జాలిపూడి, మాదేపల్లి వైపు వెళ్లే ప్రధాన పంట కాలువ గురప్రు డెక్క,తూడు, తుక్కు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిందని కనీసం కాలువలు బాగు చేయకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పంట కాలువలు బాగు చేస్తామని హడావుడి చేశారే తప్ప బాగు చేసింది ఏమీ లేదన్నారు. ఇరిగేషన్ అధికారులు మొద్దు నిద్ర వీడి చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. స్పందన రాకపోతే 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఏలూరు కై కలూరు రోడ్డును దిగ్బంధించాలని నిర్ణయించారు.
ఏలూరు– కై కలూరు రోడ్డును దిగ్బంధిస్తామని హెచ్చరిక

నీరందక రైతుల కన్నీరు