
తడవని మడి.. అన్నదాతల్లో అలజడి
జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పది రోజులపాటు వరద పోటెత్తింది. అయినా జిల్లాలో ఖరీఫ్ పంటలకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ ప్రణాళికారాహిత్యం, ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు వార్షిక మరమ్మతులు నిర్వహించాల్సిన డ్రెయిన్లను పట్టించుకోకపోవడం, కృష్ణా డెల్టాకు కావాల్సిన మేరకు నీటిని విడుదల చేయకపోవడం వెరసి జిల్లాలో సాగు కష్టాలు ఆదిలోనే మొదలయ్యాయి. వారం నుంచి వర్షాభావం, సాగునీరు అందకపోవడంతో రెండు నియోజకవర్గాల్లో నారుమడులు ఎండిపోతున్న పరిస్థితి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో 1,78,893 ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగుతున్నట్టు అంచనా. ప్రధానంగా కృష్ణా ఆయకట్టు పరిధిలో పెదపాడు, ఏలూరు రూరల్, దెందులూరు మండలాల్లో మొత్తం 58 వేల ఎకరాలు సాగవుతుంది. దీనిలో ఏలూరు రూరల్ మండల పరిధిలో 15,500 ఎకరాలు, పెదపాడు మండలంలో 35,500 ఎకరాలు, దెందులూరు మండలంలో 7 వేల ఎకరాల వరకు సాగు భూములున్నాయి. ఏలూరు రూరల్ మండలంలో మాదేపల్లి, లింగారావుగూడెం, వెంకటాపురం, జాలిపూడి తదితర గ్రామాల్లో 10 వేల ఎకరాల్లో వరి సాగు ఉండగా మిగిలింది చేపల చెరువులుగా ఉన్నాయి. పెదపాడు మండలంలో 25 వేల ఎకరాలు సాగు భూమి ఉండగా మిగతా విస్తీర్ణంలో చేపల చెరువులు విస్తరించాయి. దెందులూరు మండలంలోని సోమవరప్పాడు, దెందులూరు, సీతంపేట, కొమిరేపల్లి గ్రామాల్లో కృష్ణా కాల్వ పరిఽధిలో 7 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. వెరసి మూడు మండలాల్లో 37 వేల ఎకరాలు కృష్ణా ఆయకట్టు ద్వారా సాగవ్వాల్సి ఉంది. దెందులూరు మండలంలో 7 వేల ఎకరాలకు గోదావరి నీటిని వివిధ మా ర్గాల ద్వారా వినియోగించుకుంటున్నారు.
30 వేల ఎకరాలకు కృష్ణా నీరే దిక్కు
ఏలూరు రూరల్ మండలంలో 10 వేల ఎకరాలకు, పెదపాడు మండలంలో 20 వేల ఎకరాలకు కృష్ణా కెనాల్ ద్వారా వచ్చే సాగునీరే ఆధారం. వర్షాలు విస్తారంగా పడినప్పుడు నారుమడులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అయితే గత కొన్నిరోజులుగా వేసవిని తలపించేలా ఎండలు తీవ్రంగా కాస్తుండటంతో ఈ ప్రాంతంలో పోసిన నారుమడులు పూర్తిగా ఎండిపోతున్నాయి. కృష్ణా కెనాల్ ద్వారా పూర్తిస్థాయిలో నీటి విడుదల లేకపోవడం, ఉన్న నీటిని ఆయా గ్రామాలకు అందించే పంట కాల్వలు నిర్వహణ లోపం కారణంగా పూర్తిగా కూరుకుపోయి ఉండటంతో సాగునీరు దిగువ గ్రామాల్లోని పంట పొలాలకు అందని దుస్థితి.
తూడు తక్షణమే తొలగించాలి
కృష్ణా కాలువలో ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూడు, వ్యర్థాలను తక్షణమే తొలగించాలి. ప్రతి ఏటా కాలువ పూడిక తీత పనులు చేపట్టేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి. పూర్తిస్థాయిలో దిగువకు సాగు నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా కెనాల్ ఆయకట్టు శివారు ప్రాంత రైతుల సమస్యను పరిష్కరించేలా యుద్ధప్రాతిపదికన కృష్ణా కాలువ పూడికతీత పనులు చేపట్టాలి.
– బైరెడ్డి లక్ష్మణరావు,
కౌలురైతు, సుంకరవారి తోట, ఏలూరు
కాల్వలను ప్రక్షాళన చేయాలి
కృష్ణా కాలువను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఆయకట్టు రైతుల పరిస్థితి ముంపునకు ముందు.. సాగుకు వెనుక అనే చందంగా ఉంది. ప్రతి వేసవిలో చేపట్టాల్సిన తాత్కాలిక పూడికతీత పనులు కూడా చేపట్టకపోవడంతో దిగువ ప్రాంతాలకు సాగు నీరు అందని పరిస్థితి తలెత్తింది. ఇకనైనా కాలువ పూడిక తీత పనులు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలి. అప్పుడే రైతులకు సాగు నీటి సమస్య తీరుతుంది.
– గుత్తికొండ వెంకట కృష్ణారావు,
రైతుసంఘం నాయకుడు
కాల్వల నిర్వహణ లేకపోవడంతో..
ఏటా వేసవిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఆయా నీటి సంఘాల ద్వారా కాల్వల మరమ్మతుల పనులను చేయడం పరిపాటి. అయితే ఈ ఏడాది ఏలూరు రూరల్ మండల గ్రామాలకు సాగునీరందే మాదేపల్లి, జాలిపూడి పంట కాల్వలతో పాటు పెదపాడు మండలంలోని గ్రామాలకు సాగు, తాగునీరందే పంట కాల్వలను మరమ్మతులు చేపట్టకపోవడం ఈ రెండు మండలాల ప్రజలకు శాపంగా మారింది. దెందులూరు మండలంలోని ఆయకట్టు రైతులకు కృష్ణా కెనాల్ ద్వారా సాగునీరందించే విషయాన్ని ఇప్పటికే అధికారులు మరిచిపోయారు. ఈ మండలంలోని కృష్ణా ఆయకట్టు రైతులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గోదావరి కాల్వ, పోలవరం కాల్వల నీటిని వినియోగించుకోవడం ప్రారంభించారు.
సాగు నీరుత్సాహం
డెల్టాలో ఖరీఫ్ కష్టాలు
నీరందక ఎండుతున్న నారుమడులు
రెండు నియోజకవర్గాల్లో సమస్య తీవ్రం
నెర్రలిస్తున్న పంట పొలాలు
పూడుకుపోతున్న డ్రెయిన్లు

తడవని మడి.. అన్నదాతల్లో అలజడి

తడవని మడి.. అన్నదాతల్లో అలజడి

తడవని మడి.. అన్నదాతల్లో అలజడి