
బాలిక కుటుంబానికి అండగా ఉంటాం
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో పదేళ్ల బాలికపై మానవమృగం అత్యాచారానికి పాల్పడడంపై వైఎస్సార్‌సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా జరుగుతున్న అఘాయిత్యాలకు పాల్పడడం హేయమని, అలాంటి వారికి కఠిన శిక్షలు పడేలా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఏలూరులో బాలిక కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం పరామర్శించారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. పోలీస్ అధికారులు నిస్పక్షపాతంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతీ రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి దారుణ సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయని, ఇలాంటి నీచుల పట్ల ప్రభుత్వ అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ తుమరాడ స్రవంతి, జిల్లా కార్యదర్శి తులసీ, పార్వతి, కొత్తపల్లి రాణి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, నగర బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు (జీఎంఆర్), నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనపనూరి జగదీష్, తదితరులు ఉన్నారు.