
కష్టాల ఊబిలో కోకో రైతు
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కంపెనీలు సిండికేట్‌గా మారడం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కోకో రైతులు పూర్తిగా నష్టపోయారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో కోకో ధర రూ.800 పలుకుతున్నా, కంపెనీల సిండికేట్ వల్ల మన రాష్ట్రంలో రూ.450కు మించలేదు. రైతుల నుంచి పూర్తిస్థాయిలో కోకో పంటను కొనుగోలు చేయకుండానే సీజన్ ముగిసిందని జూన్ నెలాఖరు నుంచి కొనుగోళ్లు నిలిపివేశాయి. దీంతో రైతుల వద్ద 800 టన్నులకు పైగా కోకో నిల్వలు మిగిలి ఉన్నాయి. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
60 శాతానికి పైగా ధర పతనం
రాష్ట్రంలో మాండలీజ్, క్యాంకో, జిందాల్, డీపీ చాక్లెట్, లోటస్‌తోపాటు మరికొన్ని కంపెనీలు కోకో కొనుగోలు చేస్తున్నాయి. మాండలీజ్ కంపెనీ మాత్రమే రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తుంది. మిగిలిన కంపెనీలు దళారుల ద్వారా కొనుగోలు చేయిస్తాయి. కోకోకు ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు సీజన్‌గా పరిగణిస్తారు. ఏప్రిల్, మే నెలల్లో ధరలు అధికంగా ఉంటాయి. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో కిలో రూ.1,050 పలికింది. ఈ ఏడాది 60 శాతానికి పైగా ధర పతనమైంది. ఏప్రిల్, మే నెలల్లో రూ.450కి అత్యధిక కొనుగోళ్లు జరిగాయి. రైతు సంఘాలు, ప్రతిపక్షాల పోరాటాలతో ప్రభుత్వం కంటితుడుపు చర్యల్లో భాగంగా కిలోకు రూ.50 అదనంగా ఇస్తామని చెప్పింది. దానిని మే 23 నుంచి జూన్ 30వ తేదీ వరకు అమలు చేసి, ఏలూరు జిల్లాలో 1,638 టన్నులకు సంబంధించిన 2,200 మంది రైతులకు మాత్రమే కిలోకు అదనంగా రూ.50 చెల్లించారు. వాస్తవానికి ఏలూరు జిల్లాలోనే ఏటా 12వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. రాష్ట్రంలో ఏలూరు జిల్లాలోనే అత్యధికంగా కోకో సాగు చేస్తారు. ఈ జిల్లాలో గతేడాది 36,290 ఎకరాల్లో కోకోను సాగు చేశారు. గత రెండు, మూడేళ్లుగా కోకో ధరలు గణనీయంగా పెరగడంతో రూ.40 వేల నుంచి రూ.50 వేలు పలికే కౌలు ధరలు, ఒక్కసారిగా రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలకు చేరాయి. దీంతో పెట్టుబడి అధికమైంది. కానీ, ధర పతనమైంది. రైతులు తీవ్రంగా నష్టపోయారు.
న్యూస్‌రీల్
రైతుల వద్ద 800 టన్నులకు పైగా కోకో నిల్వలు
ప్రస్తుతం రైతుల వద్ద 800 టన్నులకు పైగా కోకో నిల్వలు ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం సీజన్ ముగిసిందని, డిమాండ్ లేదని, కోకో నట్స్‌లో బటర్ శాతం తక్కువగా ఉందని.. ఇలా రకరకాల సాకులతో దళారులు కిలో రూ.350 నుంచి రూ.400కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి మార్చి నుంచి కోకో పంటకు అంతర్జాతీయంగా కిలో ధర రూ.800–రూ.850 మధ్య కొనసాగుతోంది. మన రాష్ట్రంలో మాత్రం రూ.450కి మించి ధర పలకలేదు.
కంపెనీల సిండికేట్‌తో రైతులకు భారీ నష్టం
సీజన్ ముగిసిందంటూ కొనుగోళ్ల నిలిపివేత
రైతుల వద్ద 800 టన్నులకు పైగా కోకో నిల్వలు
గతేడాది కిలో రూ.1,050 ఉన్న కోకో ధర
ఈ సీజన్‌లో సగటున కిలో రూ.450 మాత్రమే
నష్టాల్లో మునిగిపోయాం
కోకో రైతులందరం నష్టాల్లో మునిగిపోయాం. గతేడాది కిలోకు రూ.1,050 వరకు ఇచ్చారు. నేడు రూ.400 మాత్రమే ఇస్తున్నారు. రైతులు చాలా పెట్టుబడి పెట్టారు. వ్యాపారులందరూ సిండికేట్ అయిపోయి రైతులను ముంచేశారు. బయటి వ్యాపారులను రానీయకుండా, వారు కొనుగోలు చేయకుండా రైతులను నష్టాలపాలు చేశారు.
– వంకినేని లక్ష్మీనారాయణ, వంగూరు, లక్ష్మీపురం, ఏలూరు జిల్లా
గిట్టుబాటు ధర కల్పించాలి
నాకున్న కొద్దిపాటి కొబ్బరితోటలో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నా. గతేడాది కిలో రూ.800–రూ.1,200 మధ్య ధర పలికింది. ఇప్పుడు కిలో ధర రూ.400కి దిగజారింది. పెట్టుబడి వ్యయం పెరిగి, ఆదాయం తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నా. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు కిలో రూ.900 గిట్టుబాటు ధర కల్పించి, వెంటనే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– తూత బాలాజీ కుమార్, తడికలపూడి, కామవరపుకోట మండలం

కష్టాల ఊబిలో కోకో రైతు

కష్టాల ఊబిలో కోకో రైతు

కష్టాల ఊబిలో కోకో రైతు