
హెచ్‌ఎం మూర్తి రాజు మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మండిపడ్డ ఉపాధ్యాయ సంఘాలు
పాలకోడేరు: పాలకొల్లు మండలం అరట్లకట్ల హైస్కూల్ గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుడు ఎస్‌వీఆర్ మూర్తిరాజు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఫ్యాప్టో చైర్మన్ పీఎస్ విజయరామరాజు (యూటీఎఫ్) డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో సోమవారం మూర్తిరాజు మృతిచెందారని తెలిపారు. రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇవ్వడంలో అధికారులు, ప్రభుత్వ వైఖరి మారని కారణంగానే హెచ్‌ఎం మూర్తిరాజు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకోడేరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు దూర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ మోడ్ శిక్షణలను రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులు ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతుంటారని, అలాంటి వారిని రెసిడెన్షియల్ శిక్షణలకు దూరంగా ఉంచాలన్నా పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఒంటెద్దు పో కడలతో ప్రభుత్వం, అధికారులు పంతాలూ పట్టింపులకు పోతున్న ధోరణిలో ఉండటం వల్లే ఇలాంటి మరణాలు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధోరణిని ఫ్యాప్టో పశ్చిమగోదావరి కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ వర్క్‌కు సంబంధించిన బాధ్యతలు పెడుతూ ప్రతి విషయాన్నీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయమనడం, వాటిలో ఉండే చి న్నపాటి లోపాలకు అధికారులు ఉపాధ్యాయులను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. తద్వా రా ఉపాధ్యాయులపై విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారని విమర్శించారు. సమావేశంలో ఫ్యాప్టో కోచైర్మన్ పి.సాయివర్మ (ఎస్‌టీయూ), ఫ్యాప్టో జనరల్ సెక్రటరీ ప్రకాష్ (ఏపీటీఎఫ్), ఫ్యాప్టో డిప్యూటీ జనరల్ సెక్రటరీ (ఏపీటీఎఫ్–1938) పాల్గొన్నారు.
ఆరోగ్యం బాగోకపోయినా..
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఆరోగ్యం బాగోకపోయినా ట్రైనింగ్‌లు అంటూ జిల్లాస్థాయి అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, ఇది సరికాదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం, ప్రధాన కార్యదర్శి బీవీ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అఽధికారుల తీరును ఖండించారు. సోమవారం వారు తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడుతూ హెచ్‌ఎం మూర్తిరాజు శిక్షణ కేంద్రంలోనే మరణించడం బాధాకరమైన విషయమన్నారు. హెచ్‌ఎం ఎస్‌వీఆర్ మూర్తిరాజు తాను అనారోగ్యంతో ఉన్నానని, ట్రైనింగ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని జిల్లా అధికారులను విజ్ఞప్తి చేసినా, తన తరపున తన అసిస్టెంట్‌ను పంపిస్తానని కోరినా జిల్లా అధికారులు మినహాయింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఒత్తిడితో ప్రధానోపాధ్యాయులకు ట్రైనింగ్‌లు ని ర్వహించడం సరికాదని విమర్శించారు.