యెల్లో సేనలు డీలా!

Sakshi Editorial On TDP Chandrababu Politics By Vardhelli Murali

జనతంత్రం

పెత్తందారు ప్రమాదకరమైనవాడు. వాడు దశకంఠుడిలా కనిపి స్తాడు. మహాబలాఢ్యునిగా గోచరిస్తాడు. నల్లధనం కొండ మీద పడగవిప్పి కూర్చున్న నల్లతాచు వాడు. కనుక భయంకరంగానే కనిపిస్తాడు. వేయి పడగల కర్కోటకుడు పెత్తందారు. ఒక్కో వ్యవస్థలోకి ఒక్కో పడగను దూర్చి ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన విషసర్పం వాడు. ఆ సర్పరాజు పేరు ఏదైనా కావచ్చు. తక్షకుడు, కర్కోటకుడు, కాలకేయుడు, పింజారకుడు, చంద్రబాబు నాయుడు, రామోజీరావు... ఇలా! పేరేదైనా సరే పెత్తందార్ల దోపిడీకి కాపుకాయడమే ఆ రాజు పని.

భయంకరంగా కనిపి స్తున్నాడని వాడికి భయపడితే పేదల బతుకులు ఎప్పటికీ మారవు. మన ఏడున్నర దశాబ్దాల ప్రజాస్వామ్యం ఇదే విషయాన్ని నిరూపించింది. ఈ విషసర్పపు కోరలు పీకేస్తేనే పేదలకు శాప విమోచనం దొరుకుతుంది. ఆ పని చేయడానికి నేను సిద్ధమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటిస్తున్నారు. తనతో కలిసి నడవడానికి సిద్ధమా అని ప్రశ్నిస్తూ జనసామాన్యాన్ని ఆయన సమాయత్తం చేస్తున్నారు. పేద పిల్లలకు బంట్రోతు చదువులు... సంపన్నులకు దొరబాబు చదువులా? ఎన్నాళ్లీ దుర్నీతి? ఇది ప్రజాస్వా మ్యమా... పెత్తందారీస్వామ్యమా?... ఇన్నాళ్లూ పెత్తందారీ స్వామ్యమే విద్యారంగాన్ని పరిపాలించింది.

ఈ దుష్పాలన ఇంకానా... ఇకపై చెల్లదని ఐదేళ్ల కింద జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చాటింపు వేశారు. ఒక్క చదువే కాదు, సమస్త జీవన రంగాల్లోని అమానవీయత, అసమానతలపై ఆయన యుద్ధం ప్రకటించారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని పేదవర్గాలకు సమకూర్చేందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. నవయుగానికి అవసరమైన ‘మాగ్నాకార్టా’ను తనదైన పద్ధతిలో అమలు చేయడం ప్రారంభించారు. అది సత్ఫలితాలనిస్తున్నది.

రెండేళ్లు కోవిడ్‌ కోతకు గురైన ఈ అయిదేళ్ల పదవీ కాలంలోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అద్భుతాలు చేసి చూపెట్టింది. ఒకపక్క ఆర్థికాభివృద్ధి సూచికలు ఊర్ధ్వ చలనాన్ని సూచిస్తుంటే, అదే సమయంలో మానవాభివృద్ధి సూచికలు కూడా అంతకంటే వేగంగా పరుగులు తీశాయి. ఇది గతంలో ఎన్నడూ చూడని అనుభవం. మానవాభివృద్ధిరంగంలో జగన్‌ ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఇంకో పది పదిహేనేళ్లలో సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చబోతున్నదని పలువురు ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు.

కొన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలపై చేసే వ్యయాన్ని గతంలో కొందరు ఆర్థికవేత్తలు తప్పుపట్టేవారు. ‘గుడ్‌ ఫిలాసఫీ బట్‌ బ్యాడ్‌ ఎకనామిక్స్‌’ అంటూ వెటకారం చేసేవారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టిన మానవాభివృద్ధి కార్యక్రమాల్లో ఏ ఒక్కదానిపైనా ఆర్థికవేత్తలు ఇటువంటి వ్యాఖ్యానం చేయకపోవడం విశేషం. పైపెచ్చు ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ‘గుడ్‌ ఫిలాసఫీ అండ్‌ గుడ్‌ ఎకనామిక్స్‌’గా పరిగణన పొందాయి.

అందువల్లనే అవి సత్ఫలితాలనిస్తున్నాయి. మానవాభివృద్ధి సూచికల్లో, స్థూల ఉత్పత్తి పెరుగుదలలో, ఉపాధి కల్పనలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పేద వర్గాల్లో ఒక గొప్ప రాజకీయ చైతన్యం తొణికిసలాడుతున్నది. సాధికారతలోని ఆత్మగౌరవ భావన వారి అనుభవంలోకి నెమ్మదిగా ప్రవేశి స్తున్నది. సాధికారత పథంలో మహిళలు ముందడుగు వేశారు. ఈ కారణాల వలన రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ రాజకీయ శిబిరం శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది.

అతి భయంకరుడూ, గండర గండడనుకున్న పెత్తందారులను తరిమికొట్టొచ్చన్న భావన బల పడుతున్నది. ఈ పెత్తందారీ శిబిరానికి తెలుగు నాట కాపలా దార్లయిన సర్పరాజులు చంద్రబాబు, రామోజీ వగైరాలని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చంద్రబాబు పార్టీ కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెబుతున్నది కదా! మరి వాళ్లెట్లా పెత్తందారీ వర్గాల ప్రతినిధులవుతారు? ఈ సంశయం కొంతమందికి కలగవచ్చు.

చంద్రబాబు పార్టీది పూటకూళ్ల సంక్షేమ సిద్ధాంతం. అన్న క్యాంటీన్లు, అక్క క్యాంటీన్లకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి సంక్షేమ పథకం వెనుక ఒక ఫిలాసఫీ ఉండాలి. ఆ పథకాన్ని అమలు చేయడం వల్ల లబ్ధిదారుకు కలిగేది తాత్కాలిక ఉపశ మనమైతే దాన్ని కంటితుడుపు సంక్షేమమంటారు. తాత్కాలిక ఉపశమనంతోపాటు లబ్ధిదారుని అభ్యున్నతికీ, సాధికారతకూ ఉపయోగపడే విధంగా పథకాన్ని డిజైన్‌ చేస్తే అది మానవాభి వృద్ధి పథకం కింద లెక్క. ఉదాహరణకు పేద జంటలకు పెళ్లి కానుక అందజేసే పథకాన్ని చంద్రబాబు కూడా అమలు చేశారు.

పద్దెనిమిది వేల అర్హులైన జంటలకు ఎగవేసినందువల్ల తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం వారికి చెల్లించిందనేది వేరే విషయం. దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇదే పథకాన్ని ‘కల్యాణమస్తు’ పేరుతో జగన్‌ ప్రభుత్వం కూడా అమలు చేసింది. కానీ అది కాదు అసలు విషయం. పథకానికి అర్హత ప్రమాణాలను కొత్తగా నిర్దేశించింది. వధువుకు 18 యేళ్లు, వరుడికి 21 యేళ్లు వయఃపరిమితి చట్టపరమైన నిబంధన. దాన్ని కచ్చితంగా అమలుచేయాలని నిర్ణయించింది. దాంతో పాటు పదవ తరగతి ఉత్తీర్ణతను కూడా అర్హతగా చేర్చింది.

అందువల్ల తప్పనిసరి టెన్త్‌ పాసవుతారు. ఆడపిల్లలకు పెళ్లి కోసం ఇంకో మూడేళ్ల గడువుంటుంది. ఇంటర్‌ వరకూ ‘అమ్మ ఒడి’ కూడా లభిస్తున్నందువల్ల ఆ పిల్లలు కచ్చితంగా ఇంటర్‌ కూడా పూర్తి చేస్తారు. డిగ్రీలో చేరుతారు. ఈ విధంగా ఒక్కో సంక్షేమ పథకాన్ని వారి కాళ్ల మీద నిలబడటానికి తోడ్పతే విధంగా డిజైన్‌ చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే! జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమం వెనుక ఇటువంటి ఎంపవర్‌మెంట్‌ ఫిలాసఫీ ఉంటుంది.

ఈ ఫిలాసఫీ సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వ ప్రాధమ్యాల్లో కూడా ఇది ప్రతిఫలిస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, స్వయం ఉపాధి వంటి రంగాలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ పేదవర్గాల ప్రజలు కూడా పెద్ద వారితో సమానంగా నిలబడేందుకు అవకాశాలు కల్పించింది. ఇండియాలోని అత్యున్నతస్థాయి కార్పొరేట్‌ విద్యను రాష్ట్రంలోని పేద విద్యార్థి కూడా అభ్యసించగలిగే ఏర్పాట్లు చేసింది. నాణ్య మైన వైద్యం పేదల ఇళ్ల వాకిళ్లకు చేరువైంది.

చిన్న సన్నకారు రైతులు కూడా లాభసాటి సేద్యం చేయడానికి అనేక కార్య క్రమాలను అమలుచేస్తూ ఆర్‌బీకే సెంటర్ల పేరుతో గ్రామ గ్రామానా ఊతకర్రలను నిలబెట్టింది. పేదవర్గాల తలరాతలు మార్చే ఇటువంటి ప్రాధమ్యాలు చంద్రబాబు సర్కారులో కని పించలేదు. విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో చంద్రబాబు దేనికి ప్రాధాన్యతనిచ్చారో అందరికీ తెలిసిందే. అమరావతి సింగిల్‌ పాయింట్‌ ఎజెండా. అదో అతి పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌. కాంట్రాక్టర్లకూ, పెట్టుబడులు పెట్టిన పెత్తందార్లకూ మాత్రమే ఉపయోగపడే ఎజెండా. ఒక తాత్కాలిక సెక్రటేరియట్‌ను కట్టి అందులో 30 శాతం కమిషన్‌ను తీసుకున్నట్టు ఇప్పుడు ఆధారాలు లభించాయి.

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎమ్‌గా మార్చు కున్నారని ఈ దేశ ప్రధాని స్వయంగా చెప్పిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. కమిషన్ల కక్కుర్తికి ప్రతిష్ఠా త్మకమైన పోలవరాన్ని ఆయన బలిపెట్టారు. నాసిరకం పనుల కారణంగా డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిని పనుల్లో అవాంఛ నీయమైన ఆలస్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి ఈ రకంగా చంద్రబాబు తీరని ద్రోహం చేసిన వారయ్యారు.

ఇదొక్కటే కాదు ఆయన ప్రభుత్వ ప్రాధమ్యాల వల్ల భారీగా లబ్ధిపొందిన వారు ఆయన, ఆయన ఆంతరంగికులు, కాంట్రా క్టర్లు, సంపన్నులు. చిల్లర లబ్ధి పొందిన వాళ్లు జన్మభూమి కమిటీల్లోని టీడీపీ కార్యకర్తలు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రాధమ్యాల వల్ల లబ్ధి పొందినవారు రాష్ట్రంలోని 85 శాతం కుటుంబాల ప్రజలు.

ఈ ప్రాధమ్యాల కారణంగానే జగన్‌ ప్రభుత్వానికి ‘పేదల ప్రభుత్వం’ అనే పేరు వచ్చింది. ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే తెలుగుదేశం, యెల్లో మీడియా కూటమికి పెత్తందార్లు అనే పేరు వచ్చింది. ఇంగ్లీషు మీడియం, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులు మన పేదవర్గాల భవిష్యత్తును సుంద రంగా మార్చివేస్తాయి. జగన్‌ ప్రభుత్వ వైద్య విధానాలు బీదా బిక్కీ తేడా లేకుండా ఆరోగ్య సమాజాన్ని నిర్మిస్తాయి.

వ్యవసాయ విధానాలు సాగుబాటను సంపన్నం చేస్తాయి. ఈ విధా నాలను వ్యతిరేకిస్తున్నారు కనుకనే వారిని పెత్తందారుల తొత్తులుగా పరిగణించవలసి వస్తున్నది. ఈ ఫిలాసఫీని పక్కన పెట్టి జగన్‌మోహన్‌రెడ్డి పేదవాడా? ఆయనది పేదల ప్రభుత్వం ఎట్లా అవుతుందని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వితండవాదాన్ని లేవదీస్తున్నారు. ఒక నాయకుడు ధనికుడా, పేద వాడా అన్నది కాదు సమస్య. ఆ నాయకుని విధా నాలు ఎవరి పురోభివృద్ధికి తోడ్పడుతున్నాయనేదే ముఖ్యం. ఆ లెక్కన జగన్‌ ప్రభుత్వం నిస్సందేహంగా పేదల ప్రభుత్వమే! చంద్రబాబు పార్టీ పెత్తందార్ల వేదికే!

రాష్ట్రంలోని పేదవర్గాల్లో ఈ రకమైన అవగాహన బలపడు తున్నది. ఫలితంగా పెత్తందారీ రాజకీయ శిబిరం తీవ్ర సంక్షో భంలోకి కూరుకొని పోయింది. జనసేన పార్టీని తన ప్రయో జనాలకోసం చంద్రబాబే పెట్టించాడనే అభిప్రాయానికి తాజా అభ్యర్థుల ప్రకటన మరింత బలం చేకూర్చింది. కనీసం మూడో వంతు సీట్లయినా వస్తాయని ఆశిస్తున్న జనసేన కార్యకర్తలు 24 సీట్ల లెక్కతో తీవ్ర నిరాశలో కూరుకొని పోయారు.

ఈ రెండు పార్టీల బలంతోనే జగన్‌ పార్టీని ఎదుర్కో లేమనీ, బీజేపీని కూడా తమ తరఫున రంగంలోకి దించాలనేది చంద్రబాబు తలపోత. బీజేపీ వాళ్లు తనవంటి ఊసరవెల్లిని నమ్ముతారో లేదోనని నాలుగేళ్లుగా పవన్‌ కల్యాణ్‌ ద్వారా లాబీయింగ్‌ నడిపిస్తున్నారు. అదేకాకుండా తన సొంత మనుషులను కూడా ఆ పార్టీలోకి జొప్పించారు. ఇప్పటివరకు బీజేపీ ఈ కూటమిలో చేరుతుందో లేదో స్పష్టత లేదు.

పరిస్థితులను గమనిస్తుంటే చంద్రబాబు వంటి మోసకారి నేతను నమ్మలేమని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అదే నిజమైతే చంద్రబాబు – పవన్‌ పార్టీలే కూటమిగా పోటీ చేయాలి. 24 సీట్లతో జూనియర్‌ భాగస్వామి పాత్ర పవన్‌ది. ఈ మాత్రం సీట్లకే ఎన్ని గంభీరోపన్యాసాలు చేశారు పవన్‌? వాళ్లు ‘సిద్ధం’ అంటే మేము ‘యుద్ధ’మని మొన్ననే ఆయన గర్జించి నట్టు కూడా గుర్తు. ఒకసారెప్పుడో జనసేన కార్యకర్తల సభలో అభిమానులు ‘సీఎం... సీఎం’ అనే నినాదాలు చేశారు.

అందుకు పవన్‌ చెప్పిన సమాధానం ఏమిటి? ‘మొన్నటి ఎన్నికల్లో కనీసం 40 సీట్లలో గెలిపించి ఉన్నట్లయితే సీఎం పదవి అడిగేవాడిని. ఇప్పుడెలా అడుగుతామ’ని అశక్తతను ప్రకటించాడు. ఇప్పుడు కూడా అంతే! 40 సీట్లలో పోటీ కూడా చేయడం లేదు. పోటీ చేస్తున్న 24 సీట్లలో పావలా పర్సెంట్‌ గెలిచినా 6 సీట్లే. కనుక ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సీఎం పదవి అడగలేరు. ఎందుకంటే అయిదేళ్ల తర్వాత కూడా కూటమి కొనసాగుతుందని ఆయనే చెప్పారు కనుక!

రెండు పార్టీలూ కలిసి 99 మంది అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో 18 మందే బీసీ వర్గాలకు చెందినవారు. ఇంకా ప్రకటించాల్సింది 76 సీట్లు. అందులో 14 రిజర్వుడు సీట్లు న్నాయి. పోతే 62 సీట్లు. వాటిలో బీసీలకు, మైనారిటీలకు ఏమాత్రం కేటాయిస్తారో చూడాలి. ఆ వర్గాల గురించి మాట్లాడే అర్హత టీడీపీ కోల్పోయినట్టే! బీసీ ఓట్లు పూర్తిగా దూరమైనట్టే! అభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలు చేయడానికి కూడా చంద్రబాబు భయపడినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. పవన్‌ కల్యాణ యితే తన అభ్యర్థిత్వాన్ని కూడా తొలి జాబితాలో ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నారు.

కేటాయించిన 24 సీట్లలో ఐదుగురి పేర్లే ఆయన ప్రకటించగలిగారు. పాపం, ఆయన ముఖకవళి కల్లో ఎక్కడా ఉత్సాహం కనిపించలేదు. పార్టీ శ్రేణులు జావగారి పోకుండా ఉండేందుకే కుప్పం నుంచి తన పేరును బాబు ప్రకటించారు గానీ, చివరి నిమిషంలో అక్కడ మార్పు ఉంటుందనేది విశ్వసనీయ సమాచారం. కానీ తొలి జాబితాతోనే శ్రేణులు డీలా పడ్డాయి. అధికార వైసీపీ ఇప్పటికే సగం యుద్ధాన్ని గెలిచింది. మన పెత్తందారు ఇంకెంతమాత్రమూ బలాఢ్యుడు కాదు. అతడొక గాలి తీసిన బెలూన్‌ మాత్రమే.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

whatsapp channel

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top