
జనతంత్రం
నలభై యాభయ్యేళ్ల కిందటి దాకా తెలుగు నాటకరంగం బతికే ఉండేది. సినిమా, టీవీలు దాన్ని పూర్తిగా మింగేయకముందు నాటి సంగతి. 1970లలో సాంఘిక ఇతివృత్తంతో కూడిన నాట కాలు, నాటికలను విరివిగా ప్రదర్శించేవాళ్లు. ఆ రోజుల్లో వచ్చిన ఒక నాటిక పేరు ‘కోహినూర్ కావాలి’. రాజకీయాలపై అదొక సెటైర్. ఒక రాజకీయ నిరుద్యోగి తన గుర్తింపు కోసం చేసే ప్రయత్నం. కథ సరిగ్గా గుర్తులేదు కానీ, సింగిల్ లైన్‌లో దాని సారాంశాన్ని చెప్చొచ్చు. సదరు నిరుద్యోగి బాగా ఆలోచించి లండన్‌లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమం చేస్తాడు. కోహినూర్ రాదు కానీ, ఆ నిరుద్యోగి కోరిక మాత్రం తీరుతుంది. విద్యార్థులు పావులుగా మిగిలిపోతారు.
ఇప్పుడున్న మన రాజకీయ నాయకులకు ఇటువంటి సెటైర్లను పేల్చకుండా రోజులు గడవని పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని మన అగ్ర నాయకులు ఈ వారం తాజాగా పేల్చిన ఓ రెండు సెటైర్లను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా సీనియర్ మోస్ట్ నాయకుడైన చంద్రబాబు వంతు. ఆయన తనకు ప్రీతిపాత్రమైన సింగపూర్ యాత్రకు శనివారం బయల్దేరారు. అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ కోసం మరోసారి సింగపూర్‌ను ఒప్పించడం ఆయన ఉద్దేశం. తప్పేమీ లేదు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లాడనుకోవచ్చు. కానీ, ఆయనకో డౌటు కూడా ఉన్నది. ఈసారి సింగపూర్ వాళ్లు ఒప్పుకుంటారో లేదోననే గుంజాటన వ్యక్తం చేశారు. కుదరక పోతే, ‘‘... అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడనే’’ సామెత మనకు ఉండనే ఉన్నది.
సింగపూర్ స్పందనపై ఆయన అనుమానానికి చెప్పిన కారణమే ఒక పెద్ద బుకాయింపు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుదిరిన స్టార్టప్ ఏరియా ఒప్పందాన్ని జగన్ సర్కార్ రద్దు చేయడమే గాక వారిని వేధించడం వల్లనే వెనకాడు తున్నారని చంద్రబాబు చెప్పారు. కానీ అసలు సంగతి దాచేస్తే దాగేది కాదు. అప్పటి స్టార్టప్ ఏరియా ఒప్పందంలో సింగపూర్ తరఫున మంత్రి ఈశ్వరన్ కీలక భూమిక పోషించారు.
ఆయనతో చంద్రబాబుకు చిరకాల స్నేహముందనేది బహిరంగ రహస్యం. అవినీతి ఆరోపణలపై ఈశ్వరన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించడమే గాకుండా సింగపూర్ ప్రభుత్వం ఆయనను జైలుకు కూడా పంపించింది. ఈమధ్యనే ఆయన విడుదలయ్యారు. అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో భాగస్వామ్యం పట్ల సింగపూర్‌కు అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈశ్వరన్ పాత్ర కారణంగా ఉండాలి.
ముందుగానే మధ్యవర్తుల ద్వారా ఒక అవగాహన కుదరకుండా ఏ ప్రభుత్వాధినేతా విదేశాలకు వెళ్లి బేరం మొదలు పెట్టడు. చేతి నుంచి పైసా పెట్టుబడి పెట్టకుండా కేవలం బ్రాండ్ వాడుకునేందుకు భాగస్వామిగా ఉండి వేలకోట్లు సంపా దించే అవకాశాన్ని సింగపూర్ వాళ్లు కాదనకపోవచ్చు. ఇంతకు ముందు కుదిరిన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ఒప్పందాన్ని పరిశీ లిస్తే దాని లోగుట్టు బోధపడుతుంది. ఒకవేళ ముందస్తు అవగాహనంటూ ఏదీ లేకపోతే ఆయన పర్యటన అసలు కారణం ఇంకేదైనా ఉండవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వాధినేత కనుక సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో మర్యాద పూర్వక భేటీలు జరగవచ్చు. జగన్ నిర్వాకం కారణంగా భాగస్వామ్యానికి వాళ్లు ఒప్పు కోలేదని వచ్చిన తర్వాత బురద చల్లవచ్చు. ముందస్తు అవగా హన ప్రకారమే ఒప్పందం కుదిరితే చంద్రబాబు వెళ్లాడు గనుక వాళ్లు దిగొచ్చారని, సింగపూర్ బ్రాండ్ మనకు కోహినూర్ డైమండ్ కంటే విలువైనదని భాజా మోగించుకోవచ్చు. ఇలా ఉభయతారకంగా ఉండాలనే జగన్‌పై ఓ కామెంట్ విసిరి ఆయన సింగపూర్ వెళ్ళారు.
గతంలో కుదిరిన స్టార్టప్ ఒప్పందం ఒక దోపిడీ పథకమని దాన్ని పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రాజధాని ప్రాంతం కోర్ ఏరియాలో 1,691 ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీల కన్సార్టియానికి అప్పగించారు. వారితో నామమాత్రపు భాగ స్వామిగా కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ) ఉంటుంది. ఈ భాగస్వాములతో కలిసి ‘అమరావతి డెవలప్ మెంట్ పార్ట్ట్‌నర్స్’ పేరుతో వ్యవహారం నడుపుతారు. ఈ భూమిలో 250 ఎకరాలు ఉచితంగా సింగపూర్ కన్సార్టియానికి బహుమతిగా లభిస్తుంది.
ఇక మిగిలిన 1,070 ఎకరాలను అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్‌తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే కన్సార్టియం పని. అభివృద్ధి చేయడానికయ్యే 5,500 కోట్ల రూపాయల ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. స్నేహితుడైన ఈశ్వరన్ నేతృత్వంలో వచ్చిన సింగపూర్ కన్సార్టియానికి ఇలా దోచిపెట్టే ఒప్పందాన్ని స్కామ్ అనకుండా ఉండగలమా? గతంలో కూడా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని ప్రచారం చేశారు కానీ, జరిగింది మాత్రం కంపెనీలతోనే! ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.
ఇక రెండో కోహినూర్ కథలో నిజంగానే కోహినూర్ డైమండ్ వృత్తాంతం ఇమిడి ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సంబంధించిన వ్యవహారం. ప్రాథమికంగా పవన్ కల్యాణ్ సినిమా నటుడు. కేవలం నటుడు అంటే సరిపోదు. పుష్కలంగా అభిమానగణం ఉన్న పాపులర్ హీరో. ఆయన కొత్త సినిమా హరిహర వీరమల్లు మొన్ననే విడుదలైంది.
విడుదలతోపాటు వివాదాలను కూడా మోసుకొచ్చింది. రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్లు సినిమాల్లో నటించకూడదన్న నియమం ఏమీ లేదు కాబట్టి ఆయన నటించడం మీద పేచీ ఏమీ లేదు. కాకపోతే ఉన్నతమైన ప్రభుత్వ బాధ్యతలో ఉన్న వ్యక్తి కనుక తను నటిస్తున్న సినిమా ఇతివృత్తం విషయంలోనూ, ఆ సినిమా విడుదలకు సంబంధించిన ఇతరత్రా విషయాల్లోనూ ఆదర్శంగా ఉంటారని ఎవరైనా ఆశిస్తారు.
విడుదలైన తొలి వారం పది రోజుల్లో టికెట్ రేట్లు పెంచుకునే విషయంపై గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే ఏ సినిమా నిర్మాతైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని, తన సినిమాలకైనా ఇది వర్తిస్తుందని కొద్దికాలం కిందనే పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ కేవలం నిర్మాత విజ్ఞప్తి మేరకే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
ఇంత చిన్న విషయంపై కూడా పవన్ తన మాట మీద నిలబడలేకపోయారు. విడుదలకు ముందురోజు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. మొఘల్ కాలంలో జరిగిన అక్రమాల గురించి మన చరిత్రలో చెప్పలేదనీ, విజయనగర సామ్రాజ్యం గొప్పతనం గురించి కూడా చెప్పలేదనీ ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా సత్యదూరం.
విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంతో పోలుస్తూ కావల్సినన్ని చరిత్ర వ్యాఖ్యానాలు అందుబాటులో ఉన్నాయి. కృష్ణదేవరాయల దండయాత్రల గురించీ, ఆయన కళా సాహితీ రంగాల పోషణ గురించీ, సాహితీ సమరాంగణాన చక్రవర్తిగా ఆయన వాసికెక్కడం గురించీ బోలెడన్ని కథలూ, గాథలూ వ్యాప్తిలో ఉన్నాయి. ఈ అంశాలన్నీ చరిత్ర పాఠాల్లో కూడా ఉన్నాయి. విజయనగర వీధుల్లో రతనాలను రాశులుగా పోసి అమ్మేవారని కూడా చదువుకున్నాము.
అశోకుడు చెట్లు నాటించెను, బాటలు వేయించెను, బావులు తవ్వించెను అనే పాఠం చదవకుండా ఎవరైనా ప్రాథమిక విద్యను పూర్తి చేస్తారా? ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం తనకంటే పెద్ద వాడైన దారా షికోను హత్య చేయించాడని, తండ్రిని చెరసాలలో పెట్టించాడనే అంశాలు కూడా మన చరిత్రలో లేవని పవన్ ఆరోపణ. అది కూడా నిజం కాదు. ఆ సాహిత్యం పుష్కలంగా అందుబాటులో ఉన్నది.
కోహినూర్ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. కృష్ణా తీరంలో లభించిందని ప్రతీతి. అక్కడినుంచి కాకతీయల రాజధాని ఓరుగల్లుకు, అల్లా వుద్దీన్ ఖిల్జీ ద్వారా ఢిల్లీకి, నాదిర్‌షా ద్వారా పర్షియాకు, మహా రాజా రంజిత్‌సింగ్ వశమై లాహోర్‌కు, అక్కడి నుంచి బ్రిటిష్ వారితో లండన్‌కు ప్రయాణం చేసిన వజ్ర రాజం. ఆరొందల సంవత్సరాల ట్రావెలాగ్ కోహినూర్‌ది. అట్లాగే ఔరంగజేబు. 17వ శతాబ్దంలో భారతదేశాన్ని శాసించిన మొఘల్ చక్రవర్తి.
ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీశారట! ఈ కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడ నేది సినిమా కథగా చెబుతున్నారు. చారిత్రకాంశాలతో ఫాంట సీలు తీయొద్దని ఎవరూ చెప్పలేరు. సృజనాత్మక కళలపై ఆంక్షలు పెట్టడం, లక్ష్మణ రేఖలు గీయడం కూడా వాంఛనీయం కాదు. కాకపోతే ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడాన్ని, ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ఉద్దేశించడాన్ని మాత్రం సహించలేము.
తనది సనాతన ధర్మ పథమని ఈమధ్యనే పవన్ కల్యాణ్ ప్రకటించుకున్న విషయం విదితమే. తన ధర్మపథ ప్రచారానికి తద్వారా తన రాజకీయ భవిష్యత్ ఉన్నతికి దోహదపడే ప్రచార చిత్రంగా దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన భావించి ఉండ వచ్చు. ఈ కారణంగా కొంత భాగాన్ని డైరెక్ట్ చేసిన క్రిష్ అర్ధంతరంగా తప్పుకున్నారనే ప్రచారం కూడా ఉన్నది. అదెంతవరకు వాస్తవమో తెలియదు. ప్రచార చిత్రంగా వాడుకున్నా ఫరవా లేదు.
కానీ, మొఘల్ చక్రవర్తుల కాలంలో అన్నీ అక్రమాలు, అకృత్యాలే జరిగాయా? ఇంకే గొప్పతనం లేదా?... వివిధ చారిత్రక దశల్లో ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై అధ్యయనం చేసిన నిపుణుల సమాచారం ప్రకారం క్రీస్తుశకం 16, 17 శతాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటాగా ఉన్నది. కొద్ది తేడాతో చైనా తర్వాత రెండో స్థానం. భారత ఉపఖండంలో విశాల భూభాగాన్ని ఐక్యం చేసి శాంతి, సుస్థిరతలను సాధించినందు వలన అక్బర్ చక్రవర్తి కాలంలో వ్యవసాయం, వస్త్ర పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెంది, బ్రిటిష్ వలస దోపిడీ మొదలయ్యేంతవరకూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నది.
అశోక చక్రవర్తి కాలంలో జరిగిన సామ్రాజ్య విస్తరణ,శాంతి – సుస్థిరత స్థాపనల ఫలితంగా, ఆ కాలంలో విరాజిల్లిన బౌద్ధమతం వెలుగులో వ్యవసాయ వాణిజ్యాలతోపాటు శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో కూడా ముందంజ వేసింది. అనంతర కాలంలో రెండు మూడు శతాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 35 శాతం వాటాను సొంతం చేసుకొని ఆర్థిక సూపర్ పవర్‌గా వెలుగొందిందని అంచనా వేశారు. అశోకా ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్ అని ఊరికే అనలేదు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారత నేత పనివాళ్ల వేళ్లను విరగ్గొట్టిందీ, భారత వ్యవసాయాన్ని ధ్వంసం చేసిందీ, భారతదేశ సంపదను కొల్ల గొట్టి తమ దేశానికి తరలించుకుపోయిందీ బ్రిటిష్‌వాళ్లే కాని, మొఘల్స్ కాదు. బాబర్ సెంట్రల్ ఏసియా నుంచి వచ్చి ఉండ వచ్చు. అనంతర మొఘల్సందరూ ఇక్కడే పుట్టారు. ఇక్కడే చనిపోయారు. ఈ దేశ చరిత్ర మీద తాజ్‌మహల్ వంటి సంత కాలను చేశారు.
బ్రిటిష్ వలసదారులకు వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి నాయకత్వం వహించింది ఆఖరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ కాదా? బ్రిటిష్ వాళ్ళు ఆయన్ను పట్టుకొని బర్మాలో ప్రవాస ఖైదు విధిస్తే, తాను చని పోయాక తన జన్మభూమి భారత్‌లో అంత్యక్రియలు చేయాలని చివరి రోజుల్లో ఆయన కోరుకున్న విషయం చరిత్రే కదా! బాధ్యత గల వ్యక్తులు చారిత్రకాంశాలతో కూడిన సినిమాలు తీసినప్పుడు ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసు కోవడం అవసరం.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com