దర్యాప్తు ప్రశ్నార్థకం కారాదు! | Sakshi Editorial On Bombay high court judgement | Sakshi
Sakshi News home page

దర్యాప్తు ప్రశ్నార్థకం కారాదు!

Jul 24 2025 12:59 AM | Updated on Jul 24 2025 12:59 AM

Sakshi Editorial On Bombay high court judgement

అంతా ఎప్పటిలాగే గడిచిపోతున్నదనుకునే వేళ హఠాత్తుగా సంభవించిన పేలుడు జనాన్ని భయకంపితుల్ని చేస్తుంది. తేరుకున్న వెంటనే అది మిగిల్చిన ప్రాణనష్టాన్నీ, విధ్వంసాన్నీ కళ్లారా చూశాక ఆ భయాందోళనలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. తీవ్ర గాయాలై కాళ్లూ చేతులూ తెగిపడినవారి ఆర్తనాదాలు మిన్నంటుతాయి. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. 

నేరగాళ్లను పట్టి బంధించాలన్న డిమాండు ఊపందుకుంటుంది. తీరా దీర్ఘకాలం గడిచాక నిందితులు నిర్దోషులనీ, దర్యాప్తు లోపభూయిష్టమనీ తేలితే ప్రజానీకంలో నిరాశా నిస్పృహలు ఆవరించవా? బాధిత కుటుంబాలు మరోసారి రోదించవా? 189 మంది మరణానికీ, 816 మంది క్షతగాత్రులు కావటానికీ కారణమైన 2006 నాటి పేలుళ్ల ఘటనల్లో బొంబాయి హైకోర్టు దాదాపు 20 యేళ్లు కావస్తుండగా వెలువరించిన తీర్పు అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. 

పోలీసులు ఈ కేసులో వెనువెంటనే 13 మందిని అరెస్టు చేశారు. వారంతా ప్రధాన నిందితులని, మరో 15 మంది పరారీలో వున్నారని తేల్చారు. నిషేధిత ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి)కి చెందిన ఈ నిందితులకు పాకిస్తాన్‌ ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాతో సంబంధ బాంధవ్యాలున్నాయని ఆరోపించారు. పేలుళ్ల ఘటనలు జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులను అరెస్టు చేయటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. 

ప్రత్యేక కోర్టు 2015 సెప్టెంబర్‌లో ఒకరు మినహా మిగిలిన 12 మందినీ దోషులుగా నిర్ధారించింది. వారిలో అయిదుగురికి ఉరిశిక్ష, మిగిలినవారికి వేర్వేరు రకాల శిక్షలు పడ్డాయి. 2021లో ఒకరు కోవిడ్‌ వ్యాధితో మరణించారు. జనం కిక్కిరిసి ప్రయాణించే సాయంత్రం సమయాన్ని పేలుళ్లకు ఎంచుకుని ఏడు లోకల్‌ రైళ్లలో బాంబులుంచి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

తమ ముందు విచారణకొచ్చిన కేసుల్లో న్యాయస్థానాలు సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలిస్తాయి. నిందితులుగా చూపించిన వారికి ఆ ఘటనలతో వున్న సంబంధం ఏమిటో, ఏ ప్రాతిపదికన వారే కారకులని పోలీసులు నిర్ధారణకొచ్చారో తరచి చూస్తాయి. ఎంతమంది దోషులైనా తప్పించుకోవచ్చుగానీ, ఒక్క నిరపరాధికి కూడా శిక్షపడరాదన్న సూత్రమే దానికి మూలం. 

ఉగ్రవాదం మన దేశానికి కొత్తగాదు. దశాబ్దాలుగా అడపా దడపా ఏదో ఒక మూల అది తలెత్తుతూనే వుంది. వివిధ సంఘటనల్లో పదులకొద్దీ మంది మరణిస్తున్నారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికన్నట్టు కొత్త చట్టాలు వస్తున్నాయి. ఉన్న చట్టాలు మరింత కఠినతరమవుతున్నాయి. కానీ చాలా సందర్భాల్లో జరుగుతున్నదేమిటో 2006 నాటి ముంబై పేలుళ్ల ఉదంతమే తార్కాణం. 

671 పేజీల తీర్పులో ముంబై హైకోర్టు ధర్మాసనం ప్రస్తావించిన లోటుపాట్లు గమనిస్తే ఇంత నాసిరకంగా దర్యాప్తు జరిగిందా అనిపిస్తుంది. నిందితుల ప్రమేయాన్ని సందేహాతీతంగా నిరూపించాలన్న కర్తవ్యం కన్నా, ఏదో అయిందనిపిద్దామన్న ధోరణే ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్‌) దర్యాప్తులో కనబడిందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. 

పేలుళ్ల ఉదంతాలప్పుడు పౌరుల్లో ఆగ్రహావేశాలు కలుగుతాయి. ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతుంది. రాజకీయ పక్షాల, ఇతర సంస్థల ఆరోపణలు సరేసరి. అందువల్ల దర్యాప్తు చేసేవారిపై ఒత్తిళ్లు పెరుగుతాయన్నది కూడా వాస్తవం. కానీ ఇవేవీ వారిని ప్రభావితం చేయకూడదు. ఘటనాస్థలిలో దొరికిన చిన్న చిన్న ఆధారాలతో అల్లుకుపోతూ ఒక పెద్ద కుట్రను ఛేదించినప్పుడే, నిజమైన నిందితులను పట్టుకున్నప్పుడే సమాజం సురక్షితంగా వుంటుంది. 

ధర్మాసనం వ్యాఖ్యానించినట్టు నిందితులను పట్టుకున్నామని, అంతా పరిష్కరించామన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించటం వల్ల సమాజానికి ఒరిగేదేమీ వుండదు. తప్పించుకున్న అసలు నిందితులు మరో దురంతానికి పథక రచన చేస్తారు. నిందితులుగా ముద్రపడినవారి కుటుంబాలు దిక్కుతోచక అల్లాడతాయి. జనానికి కావాల్సింది ఆ దారుణానికి పాల్పడ్డ నేరగాళ్లను పట్టుకోవటం తప్ప ఆ పేరిట ఎవరో కొందరిని నిందితులుగా చూపటం కాదు. 

దేశం మొత్తాన్ని పట్టికుదిపిన కేసులో సాదాసీదా దర్యాప్తు సరికాదని పోలీసు ఉన్నతాధికారులకు అనిపించకపోవటం ఆశ్చర్యం. ఎన్నో కేసుల దర్యాప్తులో పాలుపంచుకొని, ఎంతో అనుభవాన్ని గడించిన వారంతా తమ స్థాయిలోనే ఈ లోటుపాట్లను పట్టుకోవటం అసాధ్యం కాదు. కనీసం న్యాయస్థానం ముందుకెళ్తే ఎలాంటి సందేహాలు ఎదురవుతాయోనన్న బెరుకు ఎవరిలోనూ లేకపోవటం విస్మయం కలిగిస్తుంది. 

సాంకేతిక కారణాలతోనే ఈ కేసు కొట్టేశారని, సుప్రీంకోర్టుకు వెళ్లి దోషులకు శిక్షపడేలా చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. సాంకేతిక కారణాల సంగతలా వుంచి నిందితుల ఒప్పుకోలు పత్రాలన్నీ దాదాపు ఒకే మాదిరి వుండటం, పొంతన లేని సాక్ష్యాలు నిందితుల అపరాధత్వంపై సందేహాలు కలిగించాయి. తాము నిర్దోషులమని నిరూపించుకునే బాధ్యత నిందితులపైనే వుండేలా చట్టాలు పదునెక్కాయి. 

కానీ పోలీసులు సక్రమంగా వ్యవహరించి నేరాంగీకారంతో సరిపోలే విధంగా తిరుగులేని సాక్ష్యాధారాలు చూపలేకపోతే ఆ నిబంధన కొరగానిదవుతుంది. దర్యాప్తు ప్రక్రియకు అవరోధంగా మారుతుంది. కనీసం పేలుళ్లలో వాడిన బాంబులేమిటో ఏటీఎస్‌ నికరంగా చెప్పలేకపోయింది. రేపు సర్వోన్నత న్యాయస్థానం ఏం నిర్ధారిస్తుందో చెప్పలేం. ఇప్పటికైతే బాధిత కుటుంబాలకు ఖేదం మిగిలింది. ఈ తీర్పు దర్యాప్తు సంస్థల తీరుతెన్నులను మరింత పదునెక్కించగలగాలి. నిజమైన నేరగాళ్లను బోనెక్కించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement