Ajay Bhanga: ‘మేడిన్‌ ఇండియా’ బంగా!

America Sends The Name World Bank President as Indian Ajay Bhanga - Sakshi

భారత్‌ మూలాలున్నవారు ప్రపంచ యవనికపై తళుక్కున మెరవటం ‘అలవాటైపోయిన’ వర్తమానంలో కూడా ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి ఇక్కడే పుట్టి పెరిగి పెద్ద చదువులు చదివిన అజయ్‌ బంగాను అమెరికా ప్రతిపాదించిందంటే అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ భారతీయ మూలాలున్నవారే. కుదిరితే రిపబ్లికన్‌ పార్టీ తరఫున దేశాధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకుంటున్న వివేక్‌ రామస్వామి సైతం ఇక్కడివారే. ఇక కోకా కోలా మొదలు అనేకానేక బహుళజాతి సంస్థలకు చాన్నాళ్లనుంచి భారతీయ సంతతికి చెందినవారు సారథ్యం వహించారు, వహిస్తున్నారు.

మునుపటంత కాకపోయినా ఇప్పటికీ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులనూ, వాటి తలరాతలనూ నిర్దేశించటంలో ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వర్ధమాన దేశానికి చెందిన ఒక వ్యక్తి అలాంటి సంస్థలకు నేతృత్వం వహించటమంటే సాధారణం కాదు. ఆ రెండు సంస్థలూ ఆవిర్భవించిన నాటినుంచీ వాటిపై వస్తున్న ప్రధాన విమర్శ– ఎప్పుడూ సంపన్న దేశాల నుంచీ, ప్రధానంగా అమెరికా నుంచీ మాత్రమే వాటి సారథులను ఎన్నుకుంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం తీవ్రంగా దెబ్బతిన్న అంత ర్జాతీయ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటం కోసం బ్రెటెన్‌వుడ్స్‌ సదస్సు జరగ్గా, అందులో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు ఉనికిలోకొచ్చాయి.

ప్రపంచ బ్యాంకుకు ఆది నుంచీ అమెరికా పౌరులే అధ్యక్షులు. అలాగే ఐఎంఎఫ్‌ ఉపాధ్యక్ష పదవి కూడా ఆ దేశానిదే. ఐఎంఎఫ్‌ అధ్యక్ష పదవి మాత్రం యూరోపియన్‌ దేశాలకు చెందినవారిది. నిజానికి ఇప్పుడు అమెరికా ఎంపిక చేసిన బంగా ఇక్కడివారే అయినా, ప్రస్తుతం పూర్తి స్థాయి అమెరికా పౌరుడు. సుపరిపాలన... సంప్రదింపులు... పాలుపంచుకోవటం అనేవి ప్రపంచబ్యాంకు మూల సూత్రాలు. కానీ ఆ మూడింటిని రుణం కోసం వచ్చే వర్ధమాన దేశాధినేతలకు ప్రవచించటం తప్ప సంస్థ పాటించదన్న విమర్శ చాన్నాళ్లుగా ఉంది. అందులో 189 సభ్యదేశాలుంటాయి.

సంపన్న దేశాలైన అమెరికా, యూరోప్‌ దేశాల పెట్టుబడులు అధికం గనుక, బ్యాంకులోని ప్రధాన భాగస్వామ్య ఆర్థిక సంస్థలన్నీ ఆ దేశాలకు సంబంధించినవే గనుక బ్యాంకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు ఆ దేశాలకే సొంతం. అయితే ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్న డిమాండ్‌ మొదటినుంచీ ఉంది. గతంలో అమెరికా నిర్ణయించినవారిలో కొందరికి ఆర్థికరంగ నేపథ్యమే లేదన్న విమర్శలు కూడా వచ్చాయి.   

పర్యావరణ పరిరక్షణ ఎజెండాలోకొచ్చిన వర్తమానంలో ప్రపంచ బ్యాంకు దానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలనీ, రుణాలిచ్చే క్రమంలో అదొక షరతుగా ఉండాలనీ కొన్నేళ్లుగా ఉద్యమ కారులు కోరుతున్నారు. ఇంకా ఏడాది పదవీకాలం ఉండగానే రాబోయే జూన్‌లో పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న డేవిడ్‌ మల్‌పాస్‌ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నామినీ. పర్యావరణంతో సహా ప్రపంచాన్ని వేధిస్తున్న కీలక అంశాల విషయంలో ట్రంప్‌ అభిప్రాయాలే ఆయనవి కూడా. నిరుడు సెప్టెంబర్‌లో ఒక సదస్సు సందర్భంగా శిలాజ ఇంధనాలవల్ల భూగోళానికి జరిగే ప్రమాదంపై ప్రశ్నించినప్పుడు ‘నేను శాస్త్రవేత్తను కాదు’ అని జవాబిచ్చి అందరి ఆగ్రహానికీ గురయ్యారు.

నిజానికి అంతక్రితమే ప్రపంచ బ్యాంకుపై ఆర్థికరంగ నిపుణులకు ఆశలు పోయాయి. పేరులో తప్ప నిజంగా ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే, దాన్ని నడిపించే లక్షణాలు బ్యాంకుకు సన్నగిల్లాయని వారి అభిప్రాయం. దాని నిబంధనలు, అదిచ్చే రుణాలకుండే షరతులు కఠినమైనవి. రుణ మంజూరులో అలవిమాలిన జాప్యం. ఇప్పుడు ధైర్యంగా సత్వర నిర్ణయాలు తీసుకునే కెనడాకు చెందిన సీడీపీక్యూ, ఎన్‌డీబీ(గతంలో బ్రిక్స్‌ బ్యాంక్‌), ఎన్‌ఐఐఎఫ్, అమెరికాకు చెందిన ఐడీఎఫ్‌సీ వంటివి రంగంలోకొచ్చాయి. అయితే ఫలానా ప్రాజెక్టుకు లేదా సంస్థకూ ప్రపంచ బ్యాంకు అప్పిచ్చిందంటే అది భారీ ప్రాజెక్టు, అన్నివిధాలా మేలైందని అభిప్రాయపడేవారు చాలామందే ఉంటారు. 

అయితే బంగాయే స్వయంగా చెప్పుకున్నట్టు ఆయన నూరుశాతం ‘మేడిన్‌ ఇండియా’వాడు. ప్రపంచ మార్కెట్లను శాసించే అమెరికాకు చెందిన ‘వాల్‌ స్ట్రీట్‌’నుంచి నేరుగా వస్తున్నవాడు. ఈసారి మహిళను ప్రోత్సహించదల్చుకున్నామని ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ప్రకటించిన కొన్ని గంటలకే బంగా ఎంపికను ప్రకటించటం అందరినీ ఒకింత ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే అందుకు కారణం ఉంది. బ్యాంకు పేదరిక నిర్మూలన లక్ష్యం నుంచి పర్యావరణ పరిరక్షణ వైపు పోవటం బ్యాంకులోని వర్ధమాన దేశాలకు నచ్చటం లేదు. ఇందువల్ల తమ అభివృద్ధి ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడతాయన్నది వాటి అభిప్రాయం. భారత్‌కు చెందిన బంగా ఈ విషయంలో అందరినీ ఒప్పిస్తారనీ, ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణలో విజయం సాధిస్తారనీ అమెరికా విశ్వ సిస్తోంది.

భారత్‌ మార్కెట్‌ ఆవిర్భవించి విస్తరిస్తున్న తొలి దశలో దాన్ని చాలా దగ్గరగా చూసిన అనుభవం బంగాకు ఉన్నదని ఆ దేశం భావన. దాదాపు దశాబ్దకాలం నుంచి మాస్టర్‌కార్డ్‌ సారథిగా ఆ సంస్థ విస్తరణలో, దాని రెవెన్యూ పెంపులో బంగా పాత్ర ప్రధానమైనది. అదీగాక 2021లో గ్లాస్గోలో జరిగిన కాప్‌–26 సదస్సు సందర్భంగా కర్బన ఉద్గారాల తగ్గింపునకు కృషి చేయాలంటూ ప్రపంచ దేశాలనుద్దేశించి బహిరంగ లేఖ రాసిన డజను మంది సీఈఓల్లో ఆయనొకరు. ఇక పర్యావరణ పరిరక్షణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించదల్చుకున్న ప్రపంచ బ్యాంకుకు బంగాను మించిన అర్హుడు మరొకరుండరని అమెరికా భావించటంలో ఆశ్చర్యమేముంది? 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top