అక్కడ అలా.. ఇక్కడ ఇలా! | - | Sakshi
Sakshi News home page

అక్కడ అలా.. ఇక్కడ ఇలా!

Oct 14 2026 12:11 AM | Updated on Oct 14 2026 12:11 AM

సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర వ్యవహారాల్లో రాజమండ్రి.. రాష్ట్రంలో రాజమహేంద్రవరం..! ఏంటీ ఈ రెండుపేర్లు అనుకుంటున్నారా... అది విజినరీ సీఎం చంద్రబాబు ఘనత. గత పుష్కరాల తొలిరోజు బాబు ప్రచారయావ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు విగతజీవులైన విషయం తెలిసిందే. ఆ సమయంలో వ్యక్తమవుతున్న ప్రజావ్యతిరేకత నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ప్రకటనలు, హామీలను మర్చిపోవడం అలవాటైన బాబు దాని గురించి పట్టించుకోలేదు. ఫలితంగా కేంద్ర రికార్డుల్లో రాజమండ్రి పేరుతోనే అన్ని కార్యకలాపాలు నడుస్తున్నాయి. కొన్ని నెలల్లో మళ్లీ పుష్కరాలు వచ్చేస్తున్నా ఆ ప్రకటనపై బాబు సర్కారు తీసుకున్న చర్యలు శూన్యం. దీంతో కీలకమైన ఎన్నికల సంఘం, ఐఆర్‌సీటీసీ, ఎయిర్‌లైన్స్‌ అన్నింటిలో పాత పేరే వ్యవహారంలో ఉంది. రాష్ట్రంలో మాత్రమే రాజమహేంద్రవరంగా పిలుస్తున్నారు.

మళ్లీ పుష్కరాలు వచ్చేస్తున్నాయ్‌...

గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. పురాతన చరిత్ర, తెలుగు సాహిత్య సంప్రదాయం, సాంస్కృతిక వైభవంతో ముడిపడిన రాజమహేంద్రవరం పేరును పునరుద్ధరించాలనేది ప్రధాన ఉద్దేశమని నాడు గొప్పగా ప్రచారం చేశారు. అదే ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం 1017 జీవో జారీ చేసింది. రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మారుస్తూ గెజిట్‌ విడుదల చేసింది. వాస్తవానికి ఒక నగరానికి కొత్త పేరు పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ రికార్డుల నుంచి కేంద్ర ప్రభుత్వ విభాగాల వరకు, రవాణా వ్యవస్థల నుంచి ఎన్నికల వ్యవస్థల వరకు ఒకే పేరు అమలులో ఉండాలి.

కేంద్ర గెజిట్‌పై కొరవడిన స్పష్టత

ఒక ప్రాంతం లేదా నగరం పేరును మార్చే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతోపాటు, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వర్తించే అధికారిక విధానాలు, సంబంధిత శాఖల రికార్డుల నవీకరణ కీలకం. అయితే రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చిన అంశంలో కేంద్ర ప్రభుత్వ తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ కాలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రతిపాదన మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2017 ఆగస్టు 3న ఎన్‌వోసీ జారీ చేసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ పెండింగ్‌లో ఉండిపోయింది.

● వాస్తవానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ఇతర కేంద్ర సంస్థల నుంచి దీనిపై స్పష్టమైన సమాచారం లేదు. పేరు మార్పునకు సంబంధించిన ప్రతిపాదన, అనుమతులు, తుది నోటిఫికేషన్‌ వివరాలు బయటకు వస్తేనే అసలు పరిస్థితి ఏంటో తేలుతుంది.

● కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్‌వోసీ ఇచ్చేస్తే సరిపోదు. రైల్వే శాఖ, పోస్టల్‌ శాఖ, సర్వే ఆఫ్‌ ఇండియా, పౌర విమానయాన శాఖ నుంచి ఎన్‌వోసీలు తీసుకోవాలి.

● నేటికీ రైల్వే టికెట్‌ బుకింగ్‌ వ్యవస్థలో ఆర్‌జేవై(రాజమండ్రి), విమానాశ్రయాల్లో ఆర్‌జేఏ అని చూపిస్తోంది. ఇది జాతీయంగా, అంతర్జాతీయంగా అనుసంధానమైన కోడ్‌. దీనిని మార్చాలంటే రైల్వే బోర్డు సాంకేతిక రికార్డులు అప్డేట్‌ చేయాలి.

● కేంద్ర హోం శాఖ సూత్రపాయ అంగీకారం తెలిపి ఎన్‌వోసీ జారీ చేసినప్పటికీ న్యూఢిల్లీలోని కేంద్ర పబ్లికేషన్స్‌ విభాగం ద్వారా భారత గెజిట్‌లో అధికారికంగా నోటిఫికేషన్‌ ప్రచురించాల్సి ఉంటుంది. ఆ ఫైనల్‌ గెజిట్‌ విడుదలైతేనే అన్ని చోట్లా పేరు మారే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వ పెద్దలే స్పష్టత ఇవ్వాలి

రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చి దశాబ్దం దాటినందున కేంద్ర గెజిట్‌ స్థితిపై అధికారిక వివరణ రావాలి. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులు, కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు, అందిన అనుమతులు, తుది నోటిఫికేషన్‌ వివరాలను ప్రజలకు వెల్లడిస్తే అనేక సందేహాలకు సమాధానం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఎన్నికల సంఘం రికార్డుల్లో పాత పేరు కొనసాగడానికి కారణాలేమిటో స్పష్టం చేయాలి. పేరు మార్పు ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది? ఇంకా ఏం చేయాలి? అనే ప్రశ్నలకు సంబంధిత ప్రభుత్వాలు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

కేంద్ర రికార్డుల్లో రాజమండ్రి

రాష్ట్రంలో రాజమహేంద్రవరం

గత పుష్కరాల చివరి రోజున ఆర్భాటంగా పేరు మార్చిన చంద్రబాబు

2017 ఆగస్టు 3న ఎన్‌వోసీ ఇచ్చిన

కేంద్రం

నేటికీ విడుదల కాని ఫైనల్‌ గెజిట్‌

జనం నోళ్లలో రాజమండ్రిగానే...

మరోవైపు ప్రభుత్వ రికార్డుల్లో ఏ పేరు ఉన్నా, ప్రజల రోజువారీ వ్యవహారాల్లో వినియోగంలో ఉన్న పేరుకు ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికీ చాలామంది రాజమండ్రి అనే పిలుస్తున్నారు. దీంతో నగరానికి రెండు పేర్లు ఉన్నాయా? ఏ సందర్భంలో ఏ పేరు ఉపయోగించాలి? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

నియోజకవర్గాల పేర్లలో పాత ఆనవాళ్లు

రాజమండ్రి పేరు ఇంకా కొనసాగుతోందనే చర్చకు నియోజకవర్గాల పేర్లు కూడా కారణమవుతున్నాయి. రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్‌ వంటి పేర్లు ఎన్నికల వ్యవస్థలో వినియోగంలో ఉండటం గమనార్హం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నగరానికి రాజమహేంద్రవరం అనే పేరు అమలు చేస్తున్నప్పుడు, ఎన్నికల సంఘం రికార్డుల్లో మాత్రం పాత పేరు ఎందుకు కొనసాగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఆర్టీసీ వెబ్‌సైట్‌లో రాజమహేంద్రవరంగా చూపిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలోనూ ఎన్‌డీఏ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చంద్రబాబు చొరవ చూపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement