ఘాట్‌ంకాలెన్నో..! | - | Sakshi
Sakshi News home page

ఘాట్‌ంకాలెన్నో..!

Oct 4 2026 9:55 AM | Updated on Oct 4 2026 9:55 AM

వేదంలా ఘోషించే గోదావరి.. అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి.. ఈ పాట ఎంత ప్రసిద్ధికెక్కిందో, గోదావరి పుష్కరాలకు అంతే ప్రాధాన్యం ఉంది. కోట్లాది మంది భక్తిభావానికి వేదిక ఇది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్ర స్థాయిలో పనులు ఇంకా మొదలు కాకపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. గోదావరి ఘాట్ల అభివృద్ధి పనులకు టెండర్ల దశ కూడా పూర్తికాపోవడం చూస్తుంటే, సన్నద్ధత ఎలా ఉందో అర్థమవుతోంది.

సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాలు.. భక్తుల విశ్వాసంతో ముడిపడిన ఆధ్యాత్మిక వేడుక. పన్నెండేళ్లకోసారి వచ్చే ఈ పర్వదినాల్లో పవిత్ర గోదావరిలో స్నానమాచరించేందుకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. అలాంటి పుష్కరాలను కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌, మంత్రులు గొప్పగా చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పనులు చేపట్టడం లేదు. 2027 జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించే పుష్కరాల కోసం అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారే తప్ప, పనులు మాత్రం ప్రారంభించడం లేదు. ముఖ్యంగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే పుష్కర ఘాట్ల అభివృద్ధి, అక్కడ భద్రత, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. గత పుష్కరాల సమయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార యావ కారణంగా చోటుచేసుకున్న తొక్కిసలాట నుంచి నేటికీ పాఠాలు నేర్వకపోవడం దారుణమని గోదావరి తీర ప్రాంత వాసులు అంటున్నారు.

ప్రణాళికతో సరి... పనులేవీ!

పుష్కరాలకు వచ్చే భక్తుల్లో అత్యధికులు గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఘాట్లకే చేరుకుంటారు. అందుకే పుష్కరాల ఏర్పాట్లలో ఘాట్ల అభివృద్ధి అత్యంత కీలకం. భక్తుల రద్దీని తట్టుకునేలా మెట్లు, స్నాన ప్రదేశాలు, రక్షణ కంచెలు, లైటింగ్‌, తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించాలి. అయితే 2027 పుష్కరాల కోసం రూ.4,026 కోట్ల అంచనాతో 4,932 పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రహదారులు, ఘాట్లు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం అరకొరగానే రూ.899 కోట్లు కేటాయించింది. ఈ ప్రణాళికలో భాగంగానే మొత్తం 440 స్నాన ఘాట్ల అభివృద్ధిని ప్రతిపాదించారు. ఇందులో 181 కొత్త ఘాట్ల నిర్మాణం, 259 ప్రస్తుత ఘాట్ల అభివృద్ధి ఉన్నాయి. పుష్కరాల సమయంలో రద్దీని తట్టుకునేందుకు ఈ పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆలస్యంగా ఆమోదం తెలపడంతో పాటు కొద్ది మొత్తంలో నిధులు కూడా ఇటీవలే కేటాయించింది. ఫలితంగా చేపట్టాల్సిన పనులకు సంబంధిత అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు కుదరలేదు.

పూర్తికాని టెండర్ల ప్రక్రియ

అధికారుల ప్రతిపాదనలు ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 232 ఘాట్ల అభివృద్ధి, కొత్తగా ఆరు ఘాట్ల నిర్మాణానికి కలిపి మొత్తంగా రూ.210 కోట్లు కేటాయించింది. ఇందులో ఒక్కోచోట రూ.40 లక్షలకు పైగా ఖర్చు చేసేందుకు 121 ఘాట్లు గుర్తించారు. వీటికి ప్రస్తుతం ఇరిగేషన్‌ శాఖ అధికారులు టెండర్లు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకూ కొనసాగనుంది. మరోవైపు ఒక్కోచోట రూ.40 లక్షలలోపు నిధులు ఖర్చు చేసేలా 117 ఘాట్లను గుర్తించారు. వీటికోసం గత నెల 29 వరకూ టెండర్లు పిలవగా 114 ఘాట్లకు మాత్రమే వచ్చాయి. కొన్ని పనులకు టెండర్లు రాకపోవడంతో మళ్లీ పిలిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇప్పటికే 114 పనులకు టెండర్లు సమర్పించిన కాంట్రాక్టర్ల అర్హతను పరిశీలిస్తున్నారు. టెక్నికల్‌, ఫైనాన్సియల్‌ బిడ్లలో అర్హత సాధించే కాంట్రాక్టర్లకు పనులు కేటాయించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు ఇంకా చాలా రోజులు పట్టే అవకాశం ఉంది. మరోవైపు 121 ఘాట్ల అభివృద్ధికి ఇంకా ఈ నెల 10 వరకూ టెండర్లు స్వీకరిస్తారు. వాటిలో ఎన్ని పనులకు ఎంత మంది టెండర్లు వేస్తారో...? ఎన్ని పనులు మిగిలిపోతాయో..? చూడాల్సి ఉంది. ఆ మిగిలిన వాటికి ఇరిగేషన్‌ శాఖ అధికారులు మళ్లీ టెండర్లు పిలిచి... కాంట్రాక్టర్ల అర్హతలు పరిశీలించి పనులు అప్పగించే సరికి మరో రెండు, మూడు నెలలు గడిచిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఈ ఏడాది ఘాట్ల అభివృద్ధి పనులు చేపట్టే అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. 2027 జనవరిలో హడావుడిగా పనులు ప్రారంభించేసి తూతూమంత్రంగా నాసిరకం నిర్మాణాలతో సరిపెట్టేసే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇలా..

జిల్లా మొత్తం మంజూరైన

ఘాట్లు నిధులు

తూర్పుగోదావరి 76 రూ.131.62 కోట్లు

కోనసీమ 105 రూ.39.84 కోట్లు

కాకినాడ 04 రూ.2.10 కోట్లు

పోలవరం 02 రూ.0.50 కోట్లు

పశ్చిమ గోదావరి 34 రూ.27.23 కోట్లు

ఏలూరు 17 రూ.8.61 కోట్లు

గత పాఠం.. నేర్వని ప్రభుత్వం

పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని, 12 రోజుల ఉత్సవాలకు పది కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆ స్థాయిలో ఏర్పాటు చేయడం లేదు. ఘాట్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌, వైద్య శాఖల సమన్వయంతో పనిచేస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. వాస్తవానికి ఆయా శాఖలు ఎక్కడా పనులే ప్రారంభించనేలేదు. గత గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందిన ఘటన రాష్ట్ర ప్రజల జ్ఞాపకాల్లో ఇంకా నిలిచే ఉంది. పుష్కరాల తొలి రోజున చంద్రబాబు ప్రచార యావ కారణంగా ఈ దారుణం చోటుచేసుకుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి పటిష్టమైన ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మంత్రులు నారాయణ, దుర్గేష్‌ సమీక్షలకే పరిమితమవుతున్నారు. అంతేతప్ప క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాలేదన్నది వాస్తవం. ముఖ్యంగా ప్రతి ఘాట్‌కు సంబంధించిన పనుల వివరాలు, కాంట్రాక్టర్లు, వ్యయాలు, పూర్తి చేయాల్సిన తేదీలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సి ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అధికారులు గోప్యత పాటిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగానే కొనసాగుతోందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఘాట్ల అభివృద్ధికి ‘చంద్ర’ గ్రహణం

గోదావరి పుష్కరాలకు 8 నెలలే గడువు

10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

కుంభమేళా తరహాలో

నిర్వహిస్తామని గొప్పలు

238 ఘాట్ల ప్రగతికి

ఇంకా పూర్తికాని టెండర్లు

చివరిలో నాసిరకం పనులకు ఎత్తుగడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement