దేవరపల్లి: రాజమహేంద్రవరం రీజియన్ టొబాకో బోర్డు పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకు రూ. 910.21 కోట్ల విలువైన 34.87 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగినట్టు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ తెలిపారు. బ్రైట్ గ్రేడ్ పొగాకు కిలో రూ. 346 పలుకుతుందని, ఎక్స్ గ్రేడు, లోగ్రేడు పొగాకు కిలోకు రూ.130 నుంచి రూ.150 వస్తుందన్నారు. కిలో గరిష్ట ధర రూ. 346, కనిష్ట ధర రూ. 130, సగటు ధర రూ. 261.77 రైతులకు లభించినట్టు ఆయన తెలిపారు. దేవరపల్లి వేలం కేంద్రంలో 5.02 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–1లో 7.64 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–2లో 8.11 మిలియన్ల కిలోలు, కొయ్యలగూడెంలో 7.26 మిలియన్ల కిలోలు, గోపాలపురం వేలం కేంద్రంలో 6.81 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయన్నారు. రైతుల వద్ద ఇంకా సుమారు 50 మిలియన్ల కిలోల పొగాకు అమ్మకానికి ఉందన్నారు.
11 నుంచి
శరన్నవరాత్ర ఉత్సవాలు
● రాజమహేంద్రవరంలో
దేవీచౌక్ సిద్ధం
● తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్థానిక దేవీచౌక్‌లోని శ్రీబాలాత్రిపుర సుందరీదేవి 93వ శరన్నవరాత్ర మహోత్సవాలు 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు శ్రీదేవి మహోత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు. దీనికోసం చేస్తున్న ఏర్పాట్లు తుది దశకు చేరాయని అన్నారు. శనివారం స్థానిక దేవి కల్యాణ మండపంలో సెక్రటరీ అల్లక సత్యనారాయణ (సాంబం), కోశాధికారి బత్తుల ఈశ్వరరావు తదితరులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలుత పోస్టర్ ఆవిష్కరించారు. రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ 10వ తేదీ శనివారం రాత్రి 9.18 గంటలకు శ్రీదేవి విగ్రహ ప్రతిష్ఠ, 11న ఉదయం కలశ స్థాపన ఉంటుందన్నారు. ప్రతి రోజూ కుంకుమ పూజలు, ఉదయం సాయంత్రం మంగళవాయిద్యాల నడుమ అఖండ హారతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 14న 108 దంపతుల పూజ ఉంటుందని ఉంటుదన్నారు. 11న శ్రీస్వర్ణకవచ కనకదుర్గాదేవి అలంకరణ, 12న అన్నపూర్ణాదేవిగా, 13న శ్రీగాయత్రీ దేవిగా, 14న శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా, 15న శ్రీమహాలక్ష్మీదేవిగా, 16న శ్రీసరస్వతి దేవిగా, 17న శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా, 18న దుర్గాదేవిగా దర్శనమిస్తారన్నారు. 19న శ్రీమహిషాసుర మర్దిని అలంకారం, 20న విజయ దశమి రోజున శ్రీరాజరాజేశ్వరీ అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారని వివరించారు. అలాగే పౌరాణిక నాటక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రముఖులు, భక్తులు సహకరించి జయప్రదం చేయాలని కోరారు. కమిటీ కమిటీ ఉపాధ్యక్షులు ముత్యాల కుమారరెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శులు పిల్లా వెంకటేశ్వరరావు, పిల్లి వెంకట రమేష్, ఆశపు దుర్గా మల్లికార్జునరావు (మల్లిబాబు) తదితరులు పాల్గొన్నారు.
దసరాకు
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
రాజమహేంద్రవరం సిటీ: దసరా పండగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని నాలుగు డిపోల నుంచి ఈ నెల 9 నుంచి 21వ తేదీ వరకూ 282 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎంయూడీ మనోహర్ శనివారం తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 81 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో గోకవరం డిపో నుంచి హైదరాబాద్– 3, విజయవాడ– 53 బస్సులు, కొవ్వూరు డిపో నుంచి హైదరాబాద్– 2, విజయవాడ– 48 బస్సులు, నిడదవోలు డిపో నుంచి విజయవాడ – 24 బస్సులు, రాజమహేంద్రవరం డిపో నుంచి హైదరాబాద్– 17, విజయవాడ– 135 బస్సులు నడపనున్నట్లు మనోహర్ తెలిపారు. ఈ బస్సులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


