సాక్షి, రాజమహేంద్రవరం: ఏదో ఒక విధంగా అధికారాన్ని దక్కించుకునేందుకు ఎన్నికల వేళ అలవిగాని హామీలిచ్చిన చంద్రబాబు అండ్ కో.. గద్దెనెక్కిన తర్వాత ఆ వాగ్దానాలను షరా మామూలుగా తుంగలో తొక్కేశారు. చంద్రబాబు చెప్పిన ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి వంటి మాటలు నమ్మి తాము మోసపోయామని నిరుద్యోగులు, విద్యార్థులు మండిపడుతున్నారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అడుగడుగునా దగా చేసిన సర్కారుపై వారు పిడికిలి బిగిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన రాజమహేంద్రవరంలో మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ మంగళవారం ఉదయం 10 గంటలకు స్థానిక షెల్టాన్ హోటల్ నుంచి ప్రారంభమమవుతుంది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు, డీఎస్సీలో అన్యాయానికి గురైన అభ్యర్థులు తరలి రావాలని ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నిర్లక్ష్యం
విద్యార్థుల చదువులకు కొండంత అండగా నిలుస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత బకాయిలతో పాటు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ఫీజులు కూడా విడుదల కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, పరీక్షలకు అనుమతించకపోవడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. జిల్లాకు సంబంధించి సుమారు రూ.280 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నా పైసా విదల్చడం లేదు.
రెండేళ్లుగా అందని నిరుద్యోగ భృతి
మరోవైపు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చడం లేదు. అధికారంలోకి రాగానే ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం కల్పిస్తామని, అప్పటి వరకూ నెలకు రూ.3 వేల భృతి చెల్లిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అండ్ కో హామీ ఇచ్చారు. గద్దెనెక్కి రెండేళ్లు దాటుతున్నా ఈ హామీ అమలుపై ఇప్పటి వరకూ మార్గదర్శకాలే విడుదల చేయలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటి భర్తీకి కనీస చర్యలు కూడా చేపట్టడం లేదు. జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల నుంచి ఏటా 10 వేల మందికి పైగా ఉత్తీర్ణులవుతున్నారు. బీటెక్, ఎంటెక్, డిప్లొమా కోర్సుల్లో సుమారు 3 వేల మంది ఉత్తీర్ణులవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడే సమయానికి జిల్లాలో 2.38 లక్షల మంది నిరుద్యోగులున్నారని తేల్చారు. ప్రస్తుతం ఆ సంఖ్య 3 లక్షలకు చేరిందన్నది అంచనా. వీరందరూ ప్రభుత్వం ప్రకటించే జాబ్ క్యాలెండర్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. మరోవైపు డీఎస్సీలో జరిగిన అవకతవకలతో అన్యాయానికి గురయ్యామంటూ వేలాది మంది అభ్యర్థులు రగిలిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇచ్చినా.. జిల్లాలోని నిరుద్యోగులకు నెలకు సుమారు రూ.90 కోట్లకు పైగా చెల్లించాలి. ఈవిధంగా అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో చంద్రబాబు సర్కారు రూ.2,160 కోట్లకు పైగా భృతిని జిల్లాలోని నిరుద్యోగులకు చెల్లించాల్సి ఉంది.
జగన్ ప్రభుత్వంలో మేలు
2019–24 మధ్య వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు సకాలంలో అందించారు. అవినీతికి ఏమాత్రం తావు లేకుండా వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పథకాలు అందించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు పారదర్శకంగా కల్పించారు. జిల్లాలో 9 వేల మందికి పైగా వలంటీర్లకు గౌరవ వేతనం అందించి ఉపాధి చూపించారు. ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి, అందులో పని చేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. పేద, బలహీన వర్గాల పిల్లల ఉన్నత చదువులకు ఆటంకం కలగకుండా ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన అందించి అండగా నిలిచారు.
ఫీజు బకాయిలన్నీ చెల్లించాలి
జిల్లాలోని విద్యార్థులకు రూ.280 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలున్నాయి. ఆ నిధులు తక్షణమే విడుదల చేయడంతో పాటు నిరుద్యోగులందరికీ రెండేళ్లుగా బకాయి ఉన్న భృతి మొత్తం చెల్లించాలి. కేంద్ర విద్యా శాఖ మంత్రి తరహాలోనే డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి.
– మానుకొండ చంద్రబాబు, జిల్లా అధ్యక్షుడు,
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి. మంత్రి లోకేశ్ రాజీనామా చేసే వరకూ బాధితుల తరఫున పోరాడతాం.
– కంటమణి రమేష్‌బాబు, జిల్లా అధ్యక్షుడు,
వైఎస్సార్ సీపీ యువజన విభాగం
వెనుక దగా ముందు దగా.. కుడి ఎడమల దగా దగా అంటూ మహాకవి శ్రీశ్రీ తన మహాప్రస్థానంలో
అక్షరీకరించిన ‘చేదుపాట’.. చంద్రబాబు
ప్రభుత్వంలో అక్షర సత్యంగా నిలుస్తోంది.
చంద్రబాబు సర్కారుపై సమరమే
ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాయమాటలతో పబ్బం గడుపుతున్న చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ సమరశంఖం పూరిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన మంగళవారం ఉదయం చేపట్టనున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయాలి. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై యువత ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేశారు. అదే ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ కూడా డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి. డీఎస్సీ అక్రమాలను నిగ్గు తేల్చేంత వరకూ పోరాటం కొనసాగిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు కూడా విడుదల చేయాలి. నిరుద్యోగ భృతి చెల్లించాలి.
– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
పిడికిలి బిగిస్తున్న
నిరుద్యోగులు, విద్యార్థులు
నేడు రాజమహేంద్రవరంలో
భారీ నిరసన ప్రదర్శన
విజయవంతం చేయాలని
వైఎస్సార్ సీపీ నేతల పిలుపు


