ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో తల్లి ఆవేదన
రాయవరం: ‘అయ్యా.. నా కుమారుడు సూరంపూడి శ్రీనివాస్ 89 శాతం వైకల్యమున్న దివ్యాంగుడు. దివ్యాంగ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ అతడికి పింఛన్ ఇవ్వడం లేదు’ అంటూ నూకరత్నం అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సోమవారం నదురుబాద గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా నూకరత్నం తన సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చింది. తన కొడుకు వైకల్యానికి సంబంధించి కాకినాడ జీజీహెచ్‌లో సర్టిఫికెట్ మంజూరైందని చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా తన కుమారుడికి దివ్యాంగ పింఛన్ మంజూరు కాలేదని వాపోయింది. తన కొడుకును అధికారుల వద్దకు తీసుకెళ్లే పరిస్థితి కూడా తనకు లేదని కన్నీటి పర్యంతమైంది. నూకరత్నం కొడుకు పరిస్థితి చూసి చలించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గతంలో కాకినాడ జీజీహెచ్ నుంచి సర్టిఫికెట్ ఇప్పించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సిరిపురపు శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయకపోవడంతో ఇటువంటి దుస్థితి ఏర్పడిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


