15కు చేరిన కరోనా కేసులు | - | Sakshi
Sakshi News home page

15కు చేరిన కరోనా కేసులు

Jul 28 2026 12:19 AM | Updated on Jul 28 2026 12:19 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/తాళ్లపూడి: జిల్లాలో కరోనా కేసులు 15కు చేరాయి. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) పి.కోమల సోమవారం ఈ వివరాలు తెలిపారు. తాజాగా ధవళేశ్వరం, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వీరితో కలిపి జిల్లాలో ఇప్పటి వరకూ కరోనా సోకిన వారి సంఖ్య 15కు చేరింది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్న ముగ్గురు బాధితుల్లో ఇద్దరికి నెగెటివ్‌ రావడంతో ఇంటికి పంపించివేశారు. మరొకరిని కూడా మంగళవారం ఇంటికి పంపిస్తామని ఆసుపత్రి వైద్యాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా మండల కేంద్రమైన తాళ్లపూడిలో కూడా ఓ కోవిడ్‌ కేసు నమోదైంది. ఇటీవల హైదరాబాద్‌ వెళ్లి వచ్చిన ఓ మహిళ ఈ నెల 23న రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ వైద్యం కోసం వెళ్లగా, అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఆమెను అధికారులు హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ మహిళ పూర్తిగా కోలుకుని, తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారని తాళ్లపూడి పీహెచ్‌సీ వైద్యాధికారి హారిక చెప్పారు.

పీజీఆర్‌ఎస్‌కు 254 అర్జీలు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమంలో ప్రజలు 254 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్‌ కీర్తి చేకూరి, జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘస్వరూప్‌ తదితరులు అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్‌కు అత్యధికంగా 82 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ కీర్తి మాట్లాడుతూ, ప్రతి అర్జీనీ ఆయా శాఖల అధికారులు సకాలంలో నాణ్యతతో బాధ్యతాయుతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం రూపొందించిన సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా అర్జీదారులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.

ఇంజినీరింగ్‌లో

84,800 సీట్లకు అనుమతి

బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూ –కాకినాడకు అనుబంధంగా ఉన్న 103 కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల నిమిత్తం 84,800 సీట్ల భర్తీకి అనుమతిచ్చారు. అలాగే, జేఎన్‌టీయూకేలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ ఏడాది నుంచి మరిన్ని సీట్ల పెంపుదలకు కూడా అనుమతి వచ్చింది. సీఎస్‌ఈ, మెకానికల్‌, ఈసీఈ, ఈఈఈ, సివిల్‌ వంటి విభాగాల్లో ఇప్పటి వరకూ ఒక్కో దానికి ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి 55 సీట్లు మాత్రమే ఉండేవి. ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) నుంచి కొత్తగా వచ్చిన అనుమతితో ఒక్కో సెక్షన్‌కు 60, ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 6 కలిపి మొత్తం 66 సీట్లు ఇచ్చారు. ఒక్కో కోర్సుకు రెండు సెక్షన్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు.

ఉన్నత విద్యా మండలికి నివేదిక

రాష్ట్రంలోని అన్ని వర్సిటీల నుంచి సీట్ల సంఖ్య నివేదికను ఉన్నత విద్యా మండలికి నివేదిస్తేనే అక్కడి నుంచి ఆన్‌లైన్‌లో కళాశాలల వివరాలు విద్యార్థులకు కనబడతాయి. రాష్ట్రంలో అత్యధిక అనుబంధ కళాశాలలు కలిగి ఉండటంతో పాటు సాంకేతిక విద్యలో కీలకంగా ఉన్న జేఎన్‌టీయూకే ఈ ప్రక్రియ పూర్తి చేసి, ఉన్నత విద్యా మండలికి నివేదిక పంపించింది. ఈ నెల 21 నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కాగా.. కళాశాల, కోర్సు ఎంపికకు కీలకమైన వెబ్‌ ఆప్షన్లకు ఈ నెల 31 వరకూ అవకాశముంది. ఉన్నత విద్యా మండలి సూచనల మేరకు సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలున్న కళాశాలలకే గుర్తింపు ఇచ్చామని జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఆర్‌.శ్రీనివాసరావు తెలిపారు. అటువంటి కళాశాలల్లో చదివిన వారికి మాత్రమే మంచి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. జేఎన్‌టీయూ–కాకినాడ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ ఏడాది అన్ని విభాగాల్లో సీట్లు పెంచి కొత్తగా మరో సెక్షన్‌ ఏర్పాటు చేస్తున్నామని ప్రిన్సిపాల్‌ కొప్పిరెడ్డి పద్మరాజు తెలిపారు. దీంతో, మరింత మంది విద్యార్థులకు కళాశాలలో చేరే అవకాశం లభిస్తుందని, ర్యాంకు ఆధారంగా అర్హులైన వారు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement