● క్షేత్ర స్థాయిలో కూటమిలో లుకలుకలు
● రేపు ఏపీ పేపరు మిల్లు గుర్తింపు
సంఘం ఎన్నికలు
● విడివిడిగా పోటీ చేస్తున్న కూటమి
పార్టీల అనుబంధ యూనియన్లు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మరో 15 ఏళ్ల పాటు కూటమిగానే సాగుతామంటూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే ప్రకటిస్తున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం కూటమిలో ఎక్కడికక్కడే లుకలుకలు కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరంలోని ఏపీ పేపరు మిల్లు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్న తీరే దీనికి అద్దం పడుతోంది. బుధవారం జరిగే ఈ ఎన్నికల్లో 715 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వైఎస్సార్‌సీ టీయూ, సీపీఎం అనుబంధ సీఐటీయూ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్‌టీయూసీ, ఎస్‌డబ్ల్యూడబ్ల్యూఏ, భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) కలసి బరిలో నిలిచాయి. మరోవైపు సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, జనసేన కార్మిక సంఘం చేయి కలిపి పోటీ చేస్తున్నాయి. టీడీపీ అనుబంధ టీఎన్‌టీయూసీ మాత్రం ఎస్‌కేఎస్ అనే కార్మిక సంఘంతో కలిసి పోటీలో ఉంది. ఈ ఎన్నికలపై టీడీపీ నేతలెవ్వరూ ఆసక్తి చూపడం లేదు. కూటమి పార్టీల అనుబంధ సంఘాలన్నీ కలిసి పోటీ చేసేలా ఒప్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ వంటి వారితో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యిదర్శి వర్రే శ్రీనివాసరావు మాత్రం గెలుపు ధీమా ప్రదర్శిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యానం చేస్తానని కూడా ఆయన సవాల్ చేశారు. కడియం పేపరు మిల్లు లాకౌట్ విషయంలో అధికార పార్టీ నాయకులు స్పందించిన తీరుపై కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు కూటమి పార్టీల అనుబంధ సంఘాలు విడివిడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం పార్టీలపై పడకుండా ఉండేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు నానా తంటాలూ పడుతున్నారు.


