రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజమహేంద్రవరంలో శనివారం వందల మంది కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, జీతాలు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకూ నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దే మున్సిపల్ కార్మికుల బతుకులు చాలా దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాలు తిరగడానికి డబ్బులు ఉంటాయే కానీ, కార్మికులు జీతాలు పెంచడానికి, సక్రమంగా జీతాలు ఇవ్వడానికి మాత్రం ఉండవన్నారు. మున్సిపల్ సేవలను ప్రైవేటుపరం చేసే 673 జీవోను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ధనాలు దుర్గమ్మ, రాష్ట్ర కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి రెడ్డి రమణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిటీ కమిటీ ప్రధాన కార్యదర్శి కాకి శారద, ఉపాధ్యక్షులు బంగారు గిరి, సహాయ కార్యదర్శులు మీసాల రమణ, దేవి, రెడ్డి శ్రీనివాస్, కోశాధికారి సరస్వతి, జ్యోతి, రాజేశ్వరి, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


