ఈ ప్రవేషాలు ఏంటో? | - | Sakshi
Sakshi News home page

ఈ ప్రవేషాలు ఏంటో?

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

పాలిసెట్‌ ఫలితాలు వెలువడి 40 రోజులు

పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు రాని ప్రకటన

అయోమయంలో విద్యార్థులు

రాజమహేంద్రవరం రూరల్‌: పదో తరగతి.. విద్యార్థి జీవితానికి మైలురాయి. ఇక్కడి నుంచి పడే బాటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అలాంటి విద్యార్థులను ప్రభుత్వం అయోమయంలోకి నెట్టేస్తోంది. సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే వారికి ఆటంకాలు తెచ్చిపెడుతోంది. పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సులు చదివితే పలు పరిశ్రమలు, కంపెనీల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంటోంది. అందుకే చాలామంది విద్యార్థులు పాలిటెక్నిక్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌లలో ప్రవేశాల ప్రక్రియ సకాలంలో ప్రారంభం కాక ప్రతి ఏడాది వేలాది సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఈ సమస్య ఏటా పునరావృతం అవుతున్నా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పాలిసెట్‌ ఫలితాలు ప్రకటించి 40 రోజులైనా, ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా శాఖ ఇంకా విడుదల చేయలేదు.

తప్పని ఎదురుచూపులు

ఉమ్మడి జిల్లాలో ఏడు ప్రభుత్వ, 19 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 4,200 సీట్లు ఉంటాయి. పాలిసెట్‌ ఫలితాలు వెలువడి 40 రోజులకు పైగా అయ్యింది. అయితే ప్రవేశాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. గతంలో ప్రవేశాలు ఆలస్యం కావడం వల్ల సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ కాకపోయాయనే ఉద్దేశంతో ఈసారి పరీక్షను ముందుగానే నిర్వహించి ఫలితాలను కూడా త్వరగా విడుదల చేశారు. ఈ సమయానికి మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటికీ షెడ్యూల్‌పై స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అనేక సీట్లు ఖాళీగా మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కళాశాలల్లో ఇంటర్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఇతర కోర్సుల్లో చేరిపోతున్నారు.

ఉమ్మడి తూర్పులో మెరుగైన ఫలితాలు

ఈ ఏడాది ఏప్రిల్‌ 25న నిర్వహించిన పాలిసెట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. తూర్పుగోదావరి జిల్లాలో 5,668 విద్యార్థులు హాజరు కాగా 5,260 మంది, కాకినాడ జిల్లాలో 10,791 మంది హాజరుకాగా 9,802 మంది, డాక్టర్‌ డీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 5,331 మందికి 4,807 మంది, పోలవరం జిల్లాలో 771 మంది విద్యార్థులకు 736 మంది పాలిసెట్‌లో అర్హత సాధించారు.

జాప్యానికి కారణాలేంటి?

ఈ సారి ప్రవేశాల జాప్యంపై పలు కారణాలు వినిపిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులు తప్పనిసరి. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు అనుమతులు లభించినప్పటికీ, కొన్ని ప్రైవేటు కళాశాలలకు ఇంకా ఆమోదం రాలేదని తెలుస్తోంది. కొన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు తమ క్యాంపస్‌లో కొత్తగా పాలిటెక్నిక్‌ కళాశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో కొన్ని కోరుకున్న బ్రాంచ్‌లకు అనుమతులు రాక ప్రవేశాల ప్రక్రియలో ఆలస్యం జరుగుతోందనే చర్చ విద్యా వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల భర్తీ కొంతమేర సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ప్రైవేట్‌ కళాశాలల్లో అనేక బ్రాంచ్‌ల్లో సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయడానికి యాజమాన్యాలు ప్రత్యక్ష ప్రవేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement