రాజానగరం: జాతీయ రహదారిపై దివాన్ చెరువు పెట్రోలు బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. అతడి కాలు, చెయ్యి విరిగిపోయాయి. విజయవాడ నుంచి డీ మార్టు సామగ్రి లోడుతో వెళుతున్న లారీ సోమవారం అర్ధరాత్రి దివాన్ చెరువులో ముందు వెళుతున్న మరో లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ తుక్కుతుక్కయిపోయి, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌కు చెందిన డ్రైవర్ సూరజ్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అతడిని స్థానికుల సాయంతో 108 అంబులెన్స్ సిబ్బంది బయటకు తీశారు. అయితే అప్పటికే అతని ఎడమ చేయి, కుడి కాలు విరిగిపోయాయి. చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


