ఖరీఫ్‌ నారుమడి.. సంరక్షణ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ నారుమడి.. సంరక్షణ తప్పనిసరి

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

జోరుగా నారుమళ్లు

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న

వ్యవసాయాధికారులు

ఆలమూరు: ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి నారుమళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం అధిక శాతం వెదజల్లు సాగు చేపడుతుండగా, మిగతా భూమిలో నారుమళ్ల ద్వారా సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని 19 మండలాల్లో ఖరీఫ్‌లో 1.29 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ ఏడాది అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందకపోవడంతో ఖరీఫ్‌ మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

నారుమడిలో యాజమాన్య పద్ధతులు

నారుమడి తయారీలో కనీస యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలను పాటిస్తే పెట్టుబడి ఆదా కావడంతో పాటు నాణ్యమైన పంటలు పండించొచ్చని ఆలమూరు వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు సీహెచ్‌కేవీ చౌదరి చెబుతున్నారు.

ఫ తొలుత 80 శాతం మొలక కలిగిన నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తన శుద్ధి చేయాలి. నారుమడులు ఏర్పాటు చేసుకునేందుకు 10 – 12 రోజుల మధ్య దమ్ము చేసి నేలను చదును చేసుకోవాలి.

ఫ పొలాల్లో నీరు పారేందుకు చిన్న కాలువలను ఏర్పాటు చేసుకుని, ప్రతి మొక్కకు నీరందేలా చూడాలి. ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, ఒక కిలో పొటాష్‌ ఎరువులను మిశ్రమం చేసి దుక్కులో వేయాలి.

ఫ చలి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశంలో భాస్వరాన్ని రెట్టింపు చేయాలి. వరి నారు ఆకుగా విచ్చుకునే వరకూ ఆరుతడులుగా నీటిని అందించాలి.

వరినాట్లకు ముందు జాగ్రత్తలు

ఫ నారుమడిలో బాటలు వేసి నీటిని తొలగించాలి. మొక్కలు కోలుకోవడానికి ఎకరా నారుమడికి యూరియా, పొటాష్‌ ఎరువులను 10 కేజీల చొప్పున అందించాలి. వరి నారుమడి వేసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి.

ఫ నారు వేయడానికి పక్షం రోజుల ముందు పొలాన్ని మురుగు దమ్ము చేయాలి. 15 సెంటీమీటర్లకు మించి లోతుగా దమ్ము చేయరాదు. పొలాన్ని దమ్ము చెక్కతో లేదా యంత్ర పరికరంతో చదును చేయాలి.

ఫ నారుమడి లేత ఆకు రంగులో ఉన్నప్పుడే నాటడం ద్వారా త్వరగా మూన కడుతుంది. నాలుగు నుంచి ఆరు ఆకుల ఉన్న నారును ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది.

ఈ వంగడాలకు ప్రాధాన్యం

ఖరీఫ్‌ సీజన్‌లో అధిక దిగుబడులు సాధించడంతో పాటు త్వరితగతిన కోతకు వచ్చే వరి వంగడాలకు రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడంతో పాటు తొందరగా కోతకు వచ్చే అవకాశం ఉండటంతో వ్యవసాయశాఖ ఈ ఖరీఫ్‌లో స్వర్ణ 7029, ఎంటీయూ 1318, ఎంటీయూ 1121 రకాలను వినియోగించాలని సూచిస్తోంది. అయితే రైతుల మాత్రం ఏళ్ల తరబడి సంప్రదాయబద్ధంగా వస్తున్న స్వర్ణ 7029 రకానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.

నారుమళ్ల దశలో సరైన యాజమాన్య పద్ధతులు, జాగ్రత్తలు, నష్ట నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా చీడపీడలను నివారించడంతో పాటు నాణ్యమైన పంటలను పండించవచ్చని వ్యవసాయశాఖ చెబుతోంది. జూన్‌ తృతీయార్థంలో నారుమళ్ల పక్రియ చేపట్టి జూలై 20 నాటికి వరినాట్లు పూర్తి చేయాలని, దీని వల్ల అక్టోబర్‌ నెలాఖరు నాటికి వరి కోతలు పూర్తయ్యే అవకాశం ఉంటుందని భావిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement