రాజమహేంద్రవరం సిటీ: రైలు ఢీకొని సుమారు 65 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని జీఆర్పీ హెచ్‌సీ గంగరాజు మంగళవారం తెలిపారు. బొమ్మూరు గురుకుల పాఠశాల ఎదురుగా ఈ ఘటన జరిగిందన్నారు. మృతుడు సుమారు 5.6 అడుగుల ఎత్తు, నలుపు రంగు ఛాయ కలిగి ఉన్నాడని, ఒంటిపై నలుపు రంగు ఫుల్ హాండ్స్ చొక్కా, నీలం, తెలుపు గల్ల లుంగీ ఉన్నాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు 94948 19898, 94407 79249, 0883 2442821 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
మేడపై నుంచి పడి..
శంఖవరం: మేడపై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శంఖవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. శంఖవరం గ్రామానికి చెందిన కుర్రే రామచక్రరావు (34)సోమవారం రాత్రి మేడపై పడుకున్నాడు. తెల్లవారుజామున కిందకు దిగొస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ మేడపై నుంచి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. రామచక్రరావుకు వివాహమైంది. తాపీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
బాణం తగిలి గాయపడిన వ్యక్తి డిశ్చార్జి
కాకినాడ క్రైం: ఈ ఏడాది మే 29న ప్రమాదవశాత్తూ బాణం తగిలి గాయాల పాలైన రంపచోడవరానికి 49 ఏళ్ల చొల్లా లచ్చిరెడ్డి కోలుకొని కాకినాడ జీజీహెచ్ నుంచి డిశ్చార్జి అయ్యాడు. వైద్యులు సకాలంలో స్పందించి కుడి ఊపిరితిత్తులో దిగిన బాణాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించారు. లచ్చిరెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 7 రోజుల జైలు
పిఠాపురం రూరల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడికి ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ పిఠాపురం సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బొమ్మిడి భారతి మంగళవారం తీర్పు ఇచ్చారని రూరల్ ఎస్సై ఎస్‌కే జానీబాషా ప్రకటనలో తెలిపారు. మండలంలోని ఎఫ్‌కే పాలెం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా గడ్డం సుబ్రహ్మణ్యం మద్యం తాగి ఆటో నడుపుతూ పట్టుబ డ్డాడు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు.
మోసగించిన ముగ్గురిపై కేసు
కోటనందూరు: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, మోసగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ మంగళవారం తెలిపారు. వివరాలు ఇవీ.. పాతకొట్టాం గ్రామానికి చెందిన మాడెం సతీష్‌ను కేఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన లాలం రవితేజ, అతడి తండ్రి లాలం నాగరాజు, తల్లి గంగారత్నం ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మపలికారు. దీనిపై పలుమార్లు రవితేజ కుటుంబ సభ్యులు సతీష్ ఇంటికి వెళ్లి స్వయంగా, ఆన్‌లైన్ ద్వారా రూ.8.50 లక్షల వరకూ వసూలు చేశారు. అనంతరం ఉద్యోగం ఇప్పించకుండా కాలయాపన చేస్తుండడంతో సతీష్ తండ్రి మాడెం పెంటయ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర స్థాయి క్రికెట్ మీట్‌కు విద్యార్థినులు
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): నాగరాజా మున్సిపాల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆర్.సంజన, ఆర్.అమృత రాష్ట్ర స్థాయి క్రికెట్ మీట్‌కు ఎంపికయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చక్రధర్ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్ – 15 క్రికెట్ పోటీల్లో వీరు తలపడతారన్నారు. ఇటీవల కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.


