మహారాణిపేట (విశాఖపట్నం): వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపొద్దని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి అన్నారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా ఆ సంస్థ కాల్ సెంటర్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాల్ సెంటర్ పనితీరు, వినియోగదారుల నుంచి అందుతున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ఫిర్యాదుల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో ఏఈలు వ్యవహరిస్తున్న తీరును ప్రత్యేకంగా పరిశీలించారు. పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న కొన్ని ఫిర్యాదులపై కాల్ సెంటర్ నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వివరణ కోరారు. వినియోగదారుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎండీ మాట్లాడుతూ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లు 24 గంటలూ అందుబాటులో ఉండి, కాల్ సెంటర్ నంబర్ 1912కు వచ్చే ప్రతి కాల్‌కు తప్పనిసరిగా స్పందించాలని ఆదేశించారు. అలాగే క్షేత్రస్థాయిలో ఏఈలు అందిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని, ఆలస్యం లేదా నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లు వినియోగదారులతో మాట్లాడుతున్న తీరును సీఎండీ స్వయంగా పరిశీలించారు. పలువురు వినియోగదారులతో జరిగిన కాల్ రికార్డులను విని, మరింత మర్యాదపూర్వకంగా, సహనంతో మాట్లాడాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తనిఖీలో ఆపరేషన్స్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాశ్, సీజీఎం పి.సోలమన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.


