నిడదవోలు: పట్టణ శివారు శశి స్కూల్ రోడ్డులోని కోళ్ల ఫారం వద్ద ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో గంజాయితో ఎనిమిది మందిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. గంజాయి కలిగి ఉన్నారనే సమాచారంతో పట్టణ ఎస్సై జగన్‌మోహన్‌రావు, సిబ్బందితో దాడి చేసి రాజమహేంద్రవరానికి చెందిన తడాల సాయి అజయ్, నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన షేక్ రహీమ్ (అజ్జు), మహమ్మద్ సలీంలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 500 గ్రాముల గంజాయి, రూ.5 వేలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి తాగుతున్న కొవ్వూరుకు చెందిన వాగాల విజయ్ కుమార్, నిడదవోలుకు చెందిన కొల్లూరి దీపేష్ పవన్ కుమార్, షేక్ నవీద్ అహ్మద్, నల్లమాటి చైతన్య రవితేజ, పాటి నాగ వేగేశ్వర సత్య రాకేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 100 గ్రాముల గంజాయి, రూ.1000 స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి అలవాటు పడిన ఐదుగురు యువకులపై కూడా కేసు నమోదు చేసి, కౌన్సెలింగ్ కోసం రాజమహేంద్రవరంలోని డీఎడిక్షన్ సెంటర్‌కు తరలించారు. గంజాయి విక్రయిస్తున్న తడాల సాయి అజయ్‌పై గతంలో బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో రెండు గంజాయి కేసులు, ఒక కొట్లాట కేసు, షేక్ రహీమ్ (అజ్జు) పై గతంలో పెరవలి పోలీస్ స్టేషన్‌లో ఒక గంజాయి కేసు ఉన్నాయి.


